ప్రణయ్‌ లేకుండా బతకడం ఎలా? కన్నీటి సంద్రంలో అమృత

నల్లగొండ: కన్నతండ్రే యముడై భర్త ప్రణయ్‌ను చంపించడంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న అమృత ఒంటరైపోయింది. విషాద సాగరంలో మునిగిపోయిన అమృతను ఓదార్చడం ఎవ్వరి వల్లా కావడం లేదు. గర్భవతైన తనకు ఒంటి నొప్పులుంటాయని, చాలాసేపు కాళ్లు ఒత్తేవాడని అమృత గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ప్రణయ్ తనకు అమ్మలా మారి గోరు ముద్దలు తినిపించేవాడని తెలిపింది. బ్రషింగ్ దగ్గర నుంచి బాతింగ్ దాకా అన్నీ తానే చూసుకునేవాడంది.

భర్తను తన కళ్ల ముందే కత్తితో నరికిన సీన్ గుర్తుకు వచ్చినప్పుడల్లా భరించలేని బాధ వస్తోందంటూ అమృత కన్నీటి పర్యంతం అవుతోంది. ప్రణయ్‌ లేకుండా ఇప్పుడు బ్రతకడం ఎలా? అంటూ ఆవేదన చెందుతోంది. కులాలు పోవాలని, ఇవన్నీ మనం పెట్టుకున్న అడ్డు గోడలేనని అమృత చెబుతోంది.

భర్తను పోగొట్టుకున్నఅమృత ప్రస్తుతం మూడు నెలల గర్భిణి. తన కడుపులో ఉన్న బిడ్డను ప్రణయ్ ప్రతిరూపంగా చూసుకుంటానని, బిడ్డ కోసమే జీవిస్తున్నా అని చెబుతోంది.

గర్భిణి అయిన తన భార్య అమృతను మిర్యాలగూడ ఆసుపత్రికి తీసుకువచ్చి తిరిగి వెళ్తున్న సమయంలో దుండగుడు ప్రణయ్‌పై కత్తితో దాడి చేశాడు. తొలి దెబ్బ తలపై, ఆ తర్వాత మెడపై వేశాడు. దీంతో ప్రణయ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

ఆరు నెలల క్రితం ప్రణయ్, తన కుమార్తె అమృత వర్షిణిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఆమె తండ్రి మారుతిరావుకు నచ్చలేదు. నాటి నుంచి కక్ష పెంచుకున్నారు. అడపాదడపా ప్రణయ్, అమృతను, మారుతీరావు బెదిరించారు కూడా. అయితే ప్రాణాలు తీసేంత కక్ష పెంచుకున్నారని ప్రణయ్, అమృత గుర్తించలేకపోయారు. కుమార్తె తమ పరువు తీసిందని భావించిన మారుతీరావు, ఆయన సోదరుడు కిరాయి హంతకులకు డబ్బులిచ్చి ప్రణయ్‌ను హత్య చేయించారని పోలీసులు తేల్చారు. ప్రణయ్ మరణాన్ని అతడి కుటుంబీకులు జీర్ణించుకోలేకపోతున్నారు. మిర్యాలగూడలో విషాద వాతావరణం నెలకొంది.

మరోవైపు ప్రణయ్ హత్యకేసు క్షణానికో మలుపు తిరుగుతోంది. తాజాగా పోలీసులు కాంగ్రెస్ పార్టీ మిర్యాలగూడ అధ్యక్షుడు కరీంను అదుపులోకి తీసుకున్నారు. కరీం తన స్నేహితుడు ఖాసీం ద్వారా రాయబారం నడిచినట్లు సమాచారం. ఖాసీం ద్వారా అబ్దుల్‌బారీ అనే వ్యక్తి హంతకుడిని పంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ కేసులో పోలీసుల అదుపులో మొత్తం ఐదుగురు నిందితులున్నారు. పోలీసుల అదుపులో మారుతీరావు, శ్రావణ్ కుమార్, కరీంతో పాటు మరో ఇద్దరు నిందితులు కూడా ఉన్నారు. ప్రణయ్‌పై కత్తితో దాడిచేసిన నిందితుడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.

ప్రణయ్‌ను హత్య చేయించడంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం హస్తం ఉందని అతడి భార్య అమృత ఆరోపించారు. తనను, ప్రణయ్‌ను రమ్మని వీరేశం పిలిచాడని, అయితే బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో వీరేశం పేరు బయటికి రావడంతో వెళ్ళేందుకు బయపడ్డామని అమృత చెప్పారు.

ఆ తర్వాత ప్రణయ్ తండ్రి బాలస్వామిపై కేతేపల్లి పోలీసులతో వీరేశం అక్రమ కేసు పెట్టించాడని చెప్పారు. బీహార్ గ్యాంగ్‌ను వీరేశమే పిలిపించాడని, తన తండ్రి మారుతీరావు రెండు సార్లు వీరేశంను కలిసాడని చెప్పారు. అమృత వర్షిణి వ్యాఖ్యలతో కలకలం రేగుతోంది. ఎన్నికల వేళ వేముల వీరేశం పేరు బయటకు రావడంతో టీఆర్ఎస్ పార్టీకి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*