ప్రణయ్ హత్యకేసులో పోలీసుల అదుపులో కాంగ్రెస్ నేత కరీం

మిర్యాలగూడ: ప్రణయ్ హత్యకేసు క్షణానికో మలుపు తిరుగుతోంది. తాజాగా పోలీసులు కాంగ్రెస్ పార్టీ మిర్యాలగూడ అధ్యక్షుడు కరీంను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో పోలీసుల అదుపులో మొత్తం ఐదుగురు నిందితులున్నారు. పోలీసుల అదుపులో మారుతీరావు, శ్రావణ్ కుమార్, కరీంతో పాటు మరో ఇద్దరు నిందితులు కూడా ఉన్నారు. ప్రణయ్‌పై కత్తితో దాడిచేసిన నిందితుడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.

అంతకు ముందు మిర్యాలగూడలో దళిత యువకుడు ప్రణయ్ హత్య కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ప్రణయ్‌ను హత్య చేయించడంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం హస్తం ఉందని అతడి భార్య అమృత ఆరోపించారు. నన్ను, ప్రణయ్‌ను రమ్మని వీరేశం పిలిచాడని, అయితే బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో వీరేశం పేరు బయటికి రావడంతో వెళ్ళేందుకు బయపడ్డామని అమృత చెప్పారు.

ఆ తర్వాత ప్రణయ్ తండ్రి బాలస్వామిపై కేతేపల్లి పోలీసులతో వీరేశం అక్రమ కేసు పెట్టించాడని చెప్పారు. బీహార్ గ్యాంగ్‌ను వీరేశమే పిలిపించాడని, తన తండ్రి మారుతీరావు రెండు సార్లు వీరేశంను కలిసాడని చెప్పారు. అమృత వర్షిణి వ్యాఖ్యలతో కలకలం రేగుతోంది. ఎన్నికల వేళ వేముల వీరేశం పేరు బయటకు రావడంతో టీఆర్ఎస్ పార్టీకి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది.

అటు ప్రణయ్ హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. అమృత వర్షిణి తండ్రి, బాబాయ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కేసులో ఏ-1 నిందితుడు మారుతీరావు కాగా, ఏ-2 నిందితుడు శ్రవణ్‌కుమార్.

అదే సమయంలో హత్యకు పాల్పడిన నిందితుడిని కూడా గోల్కొండ పోలీస్ స్టేషన్ ఏరియాలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఒక మహిళ, పురుషుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 20 లక్షలకు సుపారీ ఇచ్చినట్లు సమాచారం. హత్యకు ముందే గ్యాంగ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న మారుతీరావు కొంత అడ్వాన్స్ కూడా చెల్లించినట్లు సమాచారం.

మరోవైపు ప్రణయ్ చనిపోయినట్లు మూడు నెలల గర్భిణి అయిన అమృతకు ఆమె బంధువులు చెప్పారు. 2011 నుంచి తనకు ప్రణయ్ పరిచయం అని, నాటి నుంచీ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని అమృత మీడియాతో చెప్పారు. తనను చాలాసార్లు ఆమె బాబాయి కొట్టాడని అమృత చెప్పారు. 2018, జనవరి 13న ఆర్య సమాజ్‌లో తమ వివాహం జరిగిందని తెలిపారు. డీఎస్పీ దగ్గర తమకు కౌన్సిలింగ్ నిర్వహించారని అమృత చెప్పారు. అయినా కూడా తాను ఒప్పుకోలేదన్నారు. ప్రణయ్ మీద ప్రేమతో ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు చెప్పారు.

కొద్ది రోజులు హైదరాబాద్‌లో ఉన్నాక తనకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక ప్రణయ్ వాళ్ల అమ్మ సహకారం అవసరం కాబట్టి మిర్యాలగూడలోనే ఉంటున్నట్లు అమృత తెలిపారు. తన పెళ్లి తన పెద్ద వాళ్లకు ఇష్టంలేదని, తన నాన్న, బాబాయ్‌లే ప్రణయ్‌ను హత్య చేయించారని ఆమె ఆరోపించారు. ప్రణయ్ గుర్తుగా తన కడుపులో పెరుగుతున్న బిడ్డను ఉంచుకుంటానని అమృత చెప్పారు. తన తండ్రి, బాబాయ్‌లను చంపేసినా పర్వాలేదని అమృత చెప్పారు.

సూత్రధారులిద్దరూ హత్యకు 45 నిమిషాల ముందే పరారయ్యారు. హత్యకు పాల్పడిన నిందితుడు కుంటుతూ నడుస్తుండటం సీసీటీవీ ఫుటేజ్‌లో స్పష్టంగా కనపడింది. పోలీసులు ఈ కిరాయి హంతకుడెవరో గుర్తించేందుకు యత్నిస్తున్నారు. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. హత్య చేసేందుకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. హత్యానంతరం దుండగుడు వెళ్లిన మార్గంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ గమనిస్తున్నారు.

మూడు నెలల గర్భిణి అయిన తన భార్య అమృతను నిన్న మిర్యాలగూడ ఆసుపత్రికి తీసుకువచ్చి తిరిగి వెళ్తున్న సమయంలో దుండగుడు అతడిపై కత్తితో దాడి చేశాడు. తొలి దెబ్బ తలపై, ఆ తర్వాత మెడపై వేశాడు. దీంతో ప్రణయ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

ఆరు నెలల క్రితం ప్రణయ్, తన కుమార్తె అమృత వర్షిణిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఆమె తండ్రి మారుతిరావుకు నచ్చలేదు. నాటి నుంచి కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది. అడపాదడపా ప్రణయ్, అమృతను, మారుతీరావు బెదిరించారు కూడా. అయితే ప్రాణాలు తీసేంత కక్ష పెంచుకున్నారని ప్రణయ్, అమృత గుర్తించలేకపోయారు. కుమార్తె తమ పరువు తీసిందని భావించిన మారుతీరావు, ఆయన సోదరుడు కిరాయి హంతకులకు పది లక్షల రూపాయలిచ్చి ప్రణయ్‌ను హత్య చేయించారని పోలీసులు తేల్చారు. ప్రణయ్ మరణాన్ని అతడి కుటుంబీకులు జీర్ణించుకోలేకపోతున్నారు. మిర్యాలగూడలో విషాద వాతావరణం నెలకొంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*