సంచలనం.. షాకిచ్చిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్…

దేశంలోని రాజకీయ నేతలందరికీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ షాకిచ్చారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేశారు. ఇంతకాలం అందరికీ సలహాలిచ్చిన ఆయన ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేశారు. జేడీయూలో చేరారు. పాట్నాలో బీహార్ సీఎం నీతీష్ కుమార్ సమక్షంలో పార్టీలో చేరారు.

2014 ఎన్నికల్లో బీజేపీ వ్యూహకర్తగా పని చేసి మోదీ విజయంలో కీలకపాత్ర పోషించిన ప్రశాంత్ కిశోర్ ఆ తర్వాత జేడియూకు, సమాజ్‌వాదీ పార్టీకి పనిచేశారు. బీహర్‌లో బీజేపీ- జేడీయూ మధ్య సీట్ల పంపకాలు, బీహార్ అభివృద్ధి అంశాలపై దృష్టి సారించారు. 2015 బీహార్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి తరపున పని చేసి సక్సెస్ అయ్యారు. 2017 పంజాబ్ ఎన్నికల్లో కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు సలహాదారుగా పని చేశారు. విజయబావుటా ఎగురవేయించారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహకర్తగా పని చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి రాజకీయ సలహాలు, సూచనలిచ్చారు. సరిగ్గా 2019 ఎన్నికల ముందే తప్పుకోవడం షాకింగ్ పరిణామమే. ప్రశాంత్ కిశోర్ సలహాలు మామూలుగా ఉండవు. ప్రత్యర్ధుల్ని ఆత్మరక్షణలో పడేసే వ్యూహాల్ని ఆయన అమలు చేశారు. జేడీయూకు సలహాదారుగా ఉన్న సమయంలో మోదీ నితీశ్ డిఎన్ఏపై అనుమానాలు వ్యక్తం చేస్తే బీహార్ ప్రజల గోర్లు, వెంట్రుకలు మోదీకి పంపారు. ఈ చర్యతో దుమారమే రేగింది. విపరీతంగా ప్రచారం లభించింది. నాటి ఎన్నికల్లో జెడియూ, ఆర్జేడీ కూటమి విజయం సాధించింది కూడా.

ఏపీలో పవన్-జగన్ కాంబినేషన్‌తో చంద్రబాబుకు చెక్ పెట్టవచ్చని ప్రశాంత్ కిశోర్ సలహా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే అధికారికంగా ఎవ్వరూ దృవీకరించలేదు. అటు జనసేన కానీ, ఇటు వైసీపీ కానీ రూఢీ చేయలేదు. అయితే ప్రచారం మాత్రం విపరీతంగా జరిగింది. పవన్-జగన్ కాంబినేషన్‌లో ఓట్ల ద్వారా మేలు జరిగి టీడీపీ ఓటమి పాలయ్యే అవకాశం ఉందని ప్రశాంత్ కిశోర్ సలహా ఇచ్చారు. అయితే పవన్, జగన్ నేరుగా వ్యక్తిగత విమర్శలకు దిగడంతో ప్రశాంత్ కిశోర్ ఫార్ములాను ఎవ్వరూ అనుసరించడం లేదని తేలిపోయింది. జగన్ అవినీతిపరుడంటూ పవన్ ప్రచారం చేయడం, ముగ్గురు భార్యలున్న వారు కూడా నీతులు చెబితే ఎలా జగన్ పవన్‌ను టార్గెట్ చేయడంతో వైసీపీ-జనసేన మధ్య డీల్ అసంభవమని తేలిపోయింది. అంటే ప్రశాంత్ కిశోర్ ఫార్ములాను జగన్, పవన్ పట్టించుకోలేదని అందరికీ అర్ధమైంది.

నేడో రేపో ఎంపీగా గెలిచి లోక్‌సభకో, రాజ్యసభకో వెళ్తారని తెలుస్తోంది. మంత్రి అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. జెడియూ ఎన్డీయేలో భాగస్వామి కనుక. రాజకీయ నేతలకు సలహాలిచ్చి బొప్పి కట్టిందో లేక రాజకీయాలు తెగ నచ్చేశాయో మొత్తానికి ప్రశాంత్ కిశోర్ లాంటి వ్యూహకర్తలు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఆహ్వానించదగ్గ పరిణామమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*