
విజయవాడ: వైసీపీకి వంగవీటి రాధాకృష్ణ కుటుంబసభ్యుడు శ్రీనివాస్ ప్రసాద్ రాజీనామా చేశారు. పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఉయ్యూరు కౌన్సిలర్, వైసీపీ జిల్లా ఫ్లోర్ లీడర్ పదవులకు వంగవీటి శ్రీనివాస్ ప్రసాద్ రాజీనామా చేశారు. విజయవాడ సెంట్రల్ నుంచి పోటీపై జగన్ హామీ ఇవ్వలేదని వంగవీటి రాధాకృష్ణ అసంతృప్తిగా ఉన్నారు.
నిన్న పార్టీ ముఖ్యనేతల సమావేశం నుంచి వంగవీటి రాధాకృష్ణ అర్ధాంతరంగా వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు, అనుచరులు, పార్టీ నేతలతో రాత్రి పొద్దుపోయేవరకు రాధాకృష్ణ మంతనాలు జరిపారు.
మరోవైపు విజయవాడ సెంట్రల్ సీటు వ్యవహారం వైసీపీకి తలనొప్పిగా మారింది. ఇవాళ్టి నుంచి గడపగడపకు వైఎస్ఆర్ కార్యక్రమం చేయాలని అధిష్టానం పిలుపునిచ్చింది. సెంట్రల్లో కార్యక్రమం చేయబోనని మల్లాది విష్ణు చెప్పడంతో వివాదం మొదలైంది. విజయవాడ పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల్లో ఇప్పటికే కార్యక్రమం మొదలైంది. అయితే సెంట్రల్లో జరగాల్సిన కార్యక్రమానికి మల్లాది విష్ణు, వంగవీటి రాధ దూరంగా ఉన్నారు. రాధాను ఎంపీగా పోటీ చేయమని అధిష్టానం చెప్పడంతో సమాలోచనలు జరుపుతున్నారు.
మరోవైపు వంగవీటి రాధా ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. యలమంచిలి రవితో వంగవీటి రాధా సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. వంగవీటి రాధా అనుచరులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వంగవీటి రంగా విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. విజయవాడ సెంట్రల్ టికెట్ రాధాకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధిష్టానం తీరుకు నిరసనగా పార్టీ పదవులకు రాజీనామా చేస్తామంటున్నారు. రాధ అనుచరులు వైసీపీ ఫ్లెక్సీలు తొలగించారు.
Be the first to comment