త్వరలోనే ఏపీకి వస్తాం: హియర్ టెక్నాలజిస్ హెడ్ ఆఫ్ గ్లోబల్ ఆపరేషన్స్ మెలోడీ

బీజింగ్: వరల్డ్ ఎకనామిక్ ఫోరం న్యూ ఛాంపియన్స్ వార్షిక సమావేశానికి మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. మొదటి రోజు హియర్ టెక్నాలజిస్ హెడ్ ఆఫ్ గ్లోబల్ ఆపరేషన్స్ మెలోడీతో భేటీ అయ్యారు. మ్యాప్ కంటెంట్, ట్రాకింగ్, లొకేషన్ సర్వీసెస్, ఐటీ సర్వీసెస్ సేవలు అందిస్తున్న హియర్ టెక్నాలజిస్ ప్రస్తుతం బెంగుళూరులో హియర్ టెక్నాలజిస్ కార్యకలాపాలునిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని, కంపెనీ విస్తరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని లోకేశ్ కోరారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని, విశాఖపట్నం ఐటీ హబ్‌గా మారుతుందన్నారు. ఫ్రాంక్లిన్ ,కాన్డ్యూయెంట్ లాంటి కంపెనీ లు విశాఖపట్నానికి వచ్చాయని లోకేశ్ గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో నైపుణ్యం ఉన్న యువతీ యువకులు ఉన్నారని, విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయడానికి ప్రతి నెలా హ్యాకథాన్స్ నిర్వహిస్తున్నామన్నారు. నూతన ఆవిష్కరణలు జీవితంలో ఒక భాగంగా మార్చేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నామని లోకేశ్ చెప్పారు. అక్టోబర్‌లో జరిగే ఫింటెక్ ఛాలెంజ్ ఈవెంట్‌లో పాల్గొనాలని ఆహ్వానించారు.

ఆంధ్రప్రదేశ్‌కి వచ్చి జరుగుతున్న అభివృద్ధి చూసిన తరువాతే ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశంపై నిర్ణయం తీసుకోవాలని లోకేశ్ కోరారు.
త్వరలోనే ఏపీకి వస్తామని, కంపెనీలో చర్చించిన తరువాత పెట్టుబడులు పెట్టే అంశంపై నిర్ణయం తీసుకుంటామని హియర్ టెక్నాలజిస్ హెడ్ ఆఫ్ గ్లోబల్ ఆపరేషన్స్ మెలోడీ చెప్పారు.

అంతకు ముందు లోకేశ్ షావోమీ సప్లయర్స్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌లో పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అనుకూల పరిస్థితులపై ప్రెజెంటేషన్ ఇచ్చారు.

భారత్‌లో మొబైల్ తయారీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, స్టార్ట్ అప్ రాష్ట్రంగా ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోందని లోకేశ్ చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి వేగంగా జరుగుతోందని, కేవలం 21 రోజుల్లోనే పరిశ్రమలకు అన్ని అనుమతులు ఇస్తున్నామని తెలిపారు.

ఫాక్స్ కాన్, సెల్ కాన్, కార్బన్, డిక్సన్ ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించాయని లోకేశ్ గుర్తు చేశారు. ఫాక్స్ కాన్ కంపెనీతో ఒకే చోట 14 వేల మంది మహిళలు పనిచేస్తున్నారని చెప్పారు. రిలయన్స్ జియో త్వరలోనే తిరుపతిలో ఎలక్ట్రానిక్స్ పార్క్ ఏర్పాటు చేస్తుందని తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. షావోమి సప్లయర్ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టాలని లోకేశ్ ఆహ్వానించారు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*