
విజయవాడ: వైసీపీలో విజయవాడ సెంట్రల్ సీటు వివాదం మరింత ముదురుతోంది. వంగవీటి రాధా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అధిష్టానం తీరుపై వంగవీటి రాధా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. విజయవాడ సెంట్రల్ సీటు ఇవ్వబోనని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. విజయవాడ తూర్పు లేదా మచిలీపట్నం ఎంపీ సీటులో పోటీ చేయాలని సూచించినట్లు తెలిసింది. విజయవాడ సెంట్రల్ టికెట్ కావాలని రాధా పట్టుబడుతున్నారు. భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో మంతనాలు జరుపుతున్నారు. ఎవరితోనూ మాట్లాడవద్దంటూ అనుచరులకు రాధా ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు విజయవాడ సెంట్రల్ సీటు చిచ్చు కొనసాగుతునే ఉంది. మల్లాదికి సమన్వయకర్తగా బాధ్యతలు ఇవ్వటంతో పార్టీ నేత గౌతంరెడ్డి అసంతృప్తితో ఉన్నారు. రాధాకు సీటు ఇవ్వకపోతే తనకు అవకాశం వస్తుందని భావించి భంగపడ్డారు. సెంట్రల్ విషయంపై పాదయాత్రలో జగన్ను రెండు రోజుల్లో కలవాలని నిర్ణయించుకున్నారు. గౌతంరెడ్డి గత ఎన్నికల్లో సెంట్రల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
విజయవాడ తూర్పు సీటు ఆశించే యలమంచిలి రవి టీడీపీ నుంచి వైసీపీలోకి చేరారు. కానీ ఇప్పుడు రాధాను తూర్పులో పోటీ చేయమని అంటుండటంతో రవి కూడా ఆందోళన చెందుతున్నారు. విజయవాడ సెంట్రల్లో బ్రాహ్మణ ఓట్లు 35 వేలు, కాపుల ఓట్లు 27 వేలు ఉన్నాయి. అదే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కాపుల ఓట్లు 37 వేలు ఉన్నాయి.
విశాఖలో ఇటీవల జరిగిన బ్రాహ్మణుల సమావేశంలో విజయవాడ సెంట్రల్ సీటు కావాలని బ్రాహ్మణులు జగన్ను కోరారు. దీనికి జగన్ ఓకే చెప్పినట్లు సమాచారం. మల్లాది విష్ణు బ్రాహ్మణ వర్గానికి చెందిన వ్యక్తి కావడం, పైగా సమన్వయకర్తగా బాధ్యతలు కూడా ఇవ్వటంతో సెంట్రల్ టికెట్ ఆయనకేనని స్పష్టమైంది. సెంట్రల్ కాకుండా తూర్పు ఇస్తామనడాన్ని రాధా వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే మచిలీపట్నం ఎంపీ నియోజకవర్గంలో కాపుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో రాధాను ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించాలని కూడా జగన్ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.
అటు విశాఖ జిల్లాలో జగన్ ప్రజాసంకల్పయాత్ర ముచ్చెర్ల క్రాస్ వద్ద కొనసాగుతోంది. యాత్ర 266వ రోజు షెడ్యూల్లో భాగంగా నేడు సెంచూరియన్ యూనివర్శిటీ, గిడజాల, వేమగొట్టిపాలెం మీదుగా పప్పలవానిపాలెం క్రాస్ వరకు పాదయాత్ర కొనసాగనుంది. జగన్ సమక్షంలో రాజమండ్రి ఛాంపర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పందెపు శ్రీను, పలువురు సభ్యులు వైసీపీలో చేరారు. అందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జగన్.
Be the first to comment