తెలంగాణలో కమల వికాసం ఖాయం: బాబుమోహన్

న్యూఢిల్లీ: పార్టీ పదవుల కోసం తాను భారతీయ జనతా పార్టీలో చేరలేదని సినీ నటుడు బాబుమోహన్ స్పష్టం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా నాయకత్వంలో తాను పనిచేయాలనుకున్నానని, అందుకే పార్టీలో చేరానని చెప్పారు. తెలంగాణలో బీజేపీ ఓ వెలుగు వెలుగుతుందని బాబుమోహన్ జోస్యం చెప్పారు. అమిత్ షా తన గురించి బాగా విన్నట్లు చెప్పారని, రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేయాలని సూచించారని తెలిపారు. పార్టీ ఆదేశిస్తే శ్రీలంకలో కూడా ప్రచారం చేస్తానన్నారు.

తాను లంచాలు తీసుకోనని, తప్పు చేసిన ఎవరినైనా తాను విమర్శిస్తానని బాబు మోహన్ చెప్పారు. ఎన్టీఆర్‌పై అభిమానంతో తాను తొలుత టీడీపీలో చేరానని, ఆ తర్వాత తగిన గౌరవం లభించకపోవడంతో టీఆర్ఎస్‌లో చేరానని చెప్పారు. ప్రస్తుతం మోదీ, అమిత్‌ షాల పనితీరుతో తాను ప్రభావితుడనయ్యానని, అందుకే వారి నేతృత్వంలో పనిచేసేందుకే బీజేపీలో చేరానన్నారు.

బాబుమోహన్ నిన్న న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తోడు రాగా బాబుమోహన్ కమలం పార్టీలో చేరారు. ఆ తర్వాత అమిత్ షా.. బాబుమోహన్‌కు ట్విటర్ ద్వారా పార్టీలోకి స్వాగతం చెబుతూ పోస్ట్ చేశారు. అమిత్‌షా తెలుగులో పోస్ట్ పెట్టారు. బాబుమోహన్ 900కు పైగా చిత్రాల్లో నటించారని, మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని ట్వీట్ చేశారు. మోదీ నాయకత్వంపై నమ్మకంతో బీజేపీలో చేరారని షా తమ ట్వీట్‌లో తెలిపారు. అమిత్ షా బాబుమోహన్‌ను బీజేపీలోకి మనస్పూర్తిగా ఆహ్వానించారు.

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ కూడా ట్విటర్  ద్వారా బాబుమోహన్‌కు స్వాగతం పలికారు.

ఆందోల్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ జర్నలిస్ట్ క్రాంతిని బరిలోకి దించగా, కాంగ్రెస్ పార్టీ మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహను పోటీకి నిలపనుందని తెలుస్తోంది. మరోవైపు బాబుమోహన్‌కు ఆందోల్ టికెట్ ఖాయమైందని సమాచారం. దీంతో ఆందోల్‌లో త్రిముఖ పోటీ ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*