ఈ ఎన్నికల్లో నా కుమార్తె పోటీ చేయదు: కొండా సురేఖ

పరకాల: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున తాను పోటీ చేయడం‌ దాదాపుగా ఖాయమైందని తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ స్పష్టం చేశారు. వరంగల్ తూర్పు, భూపాలపల్లి నియోజక వర్గాల నుంచి పోటీ చేయాలని కార్యకర్తల నుంచి ఒత్తిడి వస్తోందన్నారు.

టీఆర్ఎస్‌ పార్టీకి ఓటమి భయంతో అసహనం పెరిగిపోయిందని సురేఖ చెప్పారు. ఈ కారణంగానే రేవంత్ రెడ్డి వంటి ప్రశ్నించే వారిపై దాడులు చేయిస్తోందని సురేఖ ఆరోపించారు. తమపైన కూడా దాడులు జరిగే అవకాశం ఉందని సురేఖ అనుమానం వ్యక్తం చేశారు.

తమ‌ కుమార్తె కొండా సుస్మితా పటేల్‌ను రాజకీయ వారసురాలిగా ఈ ఎన్నికల్లోనే బరిలోకి దించాలనుకున్నప్పటికీ ఇటీవల జరిగిన పరిణామాలతో ఆమె నొచ్చుకున్నారని సురేఖ చెప్పారు. రాజకీయాలంటేనే సుస్మిత విరక్తి చెందుతోందని, ఈ ఎన్నికల్లో ఆమె ఎక్కడా పోటీ చేయబోదని సురేఖ స్పష్టం చేశారు. అదే సమయంలో తన భర్త కొండా మురళి కూడా పోటీ చేయడం లేదని ఆమె చెప్పారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రతి నియోజక వర్గంలోనూ తాము కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామన్నారు. కేసీఆర్ మాటలను జనం నమ్మే పరిస్థితిలో లేరని సురేఖ కుండ బద్దలు కొట్టారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*