హైదరాబాద్‌లో రివర్స్ ప్రేమలు.. పోలీసులను ఆశ్రయించిన అబ్బాయిలు!

యువతీ యువకుల మధ్య ప్రేమ సహజం. కొన్ని చోట్ల అబ్బాయిలు తమను వేధిస్తున్నారంటూ అమ్మాయిలు పోలీసులు మెట్లెక్కడం కూడా చూస్తూనే ఉంటాం. అయితే, ఇది మాత్రం సీన్ రివర్స్ వ్యవహారం. ప్రేమ పేరుతో అమ్మాయి తనను వేధిస్తోందంటూ ఓ అబ్బాయి పోలీసులకు ఫిర్యాదు చేస్తే, అమ్మాయి తనను దూరంగా పెట్టి వివక్ష చూపుతోందంటూ మరో అబ్బాయి పోలీసులను ఆశ్రయించాడు. అయితే, ఈ కేసులు చట్టాల పరిధిలోకి రావని పోలీసులు తేల్చి చెప్పడంతో ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు.

హైదరాబాద్‌కు చెందిన ఓ వైద్యుడి కుమారుడు చదువులో మెరిక. ఇంటర్‌లో 95 శాతం మార్కులొచ్చాయి. కుమారుడిని డాక్టర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న తల్లిదండ్రులు నీట్ కోచింగ్ సెంటర్‌లో చేర్పించారు. అదే సెంటర్‌లో కోచింగ్‌కు వస్తున్న ఓ యువతి ఫిట్స్‌తో బాధపడుతోంది. ఓ రోజు ఆమె క్లాసులో ఫిట్స్‌తో కుప్పకూలితే ఈ విద్యార్థి ఆమెకు సాయం చేశాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. యువకుడిపై మనసు పారేసుకున్న యువతి తనను ప్రేమించమంటూ యువకుడి వెంట పడి వేధించడం మొదలుపెట్టింది.

వాట్సాప్‌లో తన ప్రైవేటు ఫొటోలు షేర్ చేస్తూ అతడిని డిస్టర్బ్ చేసింది. దీంతో అతడు చదువుపై ఏకాగ్రత కోల్పోయాడు. మార్కులు తగ్గాయి. దీంతో ముభావంగా మారిపోయాడు. ఆరా తీసిన అబ్బాయి తల్లికి అసలు విషయం తెలిసి అమ్మాయికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించింది. అయినా, అమ్మాయి వేధింపులు ఆపకపోవడంతో పోలీసులను ఆశ్రయించి బాధ వెళ్లబోసుకున్నారు.

మరో కేసులో.. ఉద్యోగం కోసం ఓ యువకుడు హైదరాబాద్ వచ్చాడు. ఈ క్రమంలో ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. కొంతకాలానికి ఇద్దరి మధ్య విభేదాలు పొడసూపాయి. దీంతో ప్రియుడిని అమ్మాయి దూరం పెట్టింది. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు అమ్మాయి తనపై వివక్ష చూపుతోందని, తనను దూరం పెడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఆశ్రయించాడు.

రెండేళ్లపాటు తనతో సన్నిహితంగా ఉన్న ఆమె, తన కుటుంబ సభ్యుల వివరాలు తెలిసే సరికి దూరం పెట్టిందని, ఇది కచ్చితంగా వివక్ష కిందికే వస్తుందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే, ఈ కేసులను నమోదు చేయడం కుదరదని, ఇవి చట్టాల పరిధిలోకి రావని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*