టీడీపీని వెంటాడుతున్న రోడ్డు ప్రమాదాలు.. మొన్న హరికృష్ణ.. నేడు ఎంవీవీఎస్ మూర్తి!

టీడీపీని రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నట్టు కనిపిస్తోంది. ఆ పార్టీ నేతలు వరుసపెట్టి రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల నల్లగొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ మాజీ ఎంపీ, పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ మృతి చెందగా, తాజాగా అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ ఎమ్మెల్సీ, విశాఖ మాజీ ఎంపీ, గీతం విద్యా సంస్థల అధినేత ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణం పాలయ్యారు. అంతకుముందు కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు, లాల్‌జాన్ బాషా కూడా రోడ్డు ప్రమాదాల్లోనే మృతి చెందారు.

ఎర్రన్నాయుడు
టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు 2 నవంబరు 2012న శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం దండానపేట క్రాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వేగంగా వెళ్తున్న ఆయన వాహనం రహదారికి అడ్డంగా తిరుగుతున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎర్రన్నాయుడు మృతి చెందారు. చంద్రబాబుకు నమ్మినబంటుగా ఉన్న ఆయన మరణం టీడీపీ శ్రేణులను కుంగదీసింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఆయన మరణం టీడీపీకి ఎద్ద ఎదురుదెబ్బ అయింది.

లాల్‌జాన్ బాషా
గుంటూరు జిల్లాకు చెందిన లాల్‌జాన్ బాషా 15 ఆగస్టు 2013న హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తుండగా నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం డివైడర్‌ను ఢీకొన్ని ఎగిరి పడింది. బాషా టీడీపీలో క్రియాశీలకంగా పనిచేశారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగానూ పనిచేశారు. గుంటూరు ఎంపీగా, టీడీపీ రాజ్య సభ సభ్యుడిగా, ఆ పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ముస్లిం వర్గాలకు బలమైన ప్రతినిధిగా ఉండేవారు. ఎప్పటికప్పుడు వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేసేవారు.

నందమూరి హరికృష్ణ
టీడీపీ మాజీ ఎంపీ, పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ ఈ ఏడాది ఆగస్టు 29న నల్లగొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఓ అభిమాని ఇంట్లో జరిగే వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా నల్లగొండ జిల్లా అన్నెపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. హరికృష్ణ మరణం టీడీపీకి తీరని లోటని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.

ఎంవీవీఎస్ మూర్తి
హరికృష్ణ మరణం టీడీపీని ఇంకా బాధపెడుతుండగానే ఆ పార్టీకి చెందిన మరో నేత, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అలస్కాలోని ఆంకరేజ్ సఫారీని సందర్శించేందుకు కాలిఫోర్నియా నుంచి వెళ్తుండగా వీరు ప్రయాణిస్తున్న వాహనం ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో మూర్తి సహా మరో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. టీడీపీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన పార్టీకి అండగా నిలిచారు.

జీఎంసీ బాలయోగి సైతం..
లోక్‌సభ స్పీకర్‌గా 2002లో సేవలందించిన టీడీపీ నేత జీఎంసీ బాలయోగి కూడా ప్రమాదంలోనే మృతి చెందారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కృష్ణా జిల్లా కైకలూరు సమీపంలో ప్రమాదవశాత్తు కుప్పకూలింది. ఈ ఘటనలో ఆయన దుర్మరణం పాలయ్యారు. తాజాగా, విశాఖపట్టణం జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మావోయిస్టుల చేతిలో దారుణహత్యకు గురయ్యారు. టీడీపీ నేతలు ఇలా వరుసగా ప్రాణాలు కోల్పోతుండడం టీడీపీ శ్రేణలను విషాదలోకి నెట్టేసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*