మరికాసేపట్లో ఈసీ ప్రకటన… తెలంగాణ ఎన్నికలపై ఉత్కంఠ

న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల ఎన్నికలపై ఎన్నికల సంఘం ప్రకటన చేయనుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం ఎన్నికలపై మరికొద్దిసేపట్లో ప్రకటన విడుదల కానుంది.

వాస్తవానికి మధ్యాహ్నం పన్నెండున్నరకు ప్రకటన విడుదల కావాల్సి ఉండగా మూడున్నరకు వాయిదా పడింది. తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికల ప్రకటనపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై వాదనలు కొనసాగుతున్న తరుణంలో తెలంగాణలో ఎన్నికల ప్రకటన రాకపోవచ్చని తెలుస్తోంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

తెలంగాణలో నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో పాటు ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని తలపోస్తూ కేసీఆర్ 9 నెలల ముందే అసెంబ్లీని రద్దు చేశారు. నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని అంతా ఆశించారు. అయితే ఓటర్ల జాబితాలో అవకతవకలంటూ న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు కావడంతో తెలంగాణలో ఎన్నికలపై ప్రకటన విడుదలౌతుందా లేదా అనేది అనుమానంగా మారింది. అనుకున్నట్లుగా ఈసీ నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణకు ఎన్నికల ప్రకటన రాకుంటే 2019 లోక్‌సభ ఎన్నికలతో పాటే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*