పట్టపగలు అందరూ చూస్తుండగానే నరికేశారు.. వరుస హత్యలతో కలకలం

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో ఉదయం తొట్ల రాజు(35) అనే వ్యక్తిని ప్రత్యర్థులు దారుణంగా నరికి చంపారు. నాగారం ప్రధాన కూడలిలో గ్రామస్తులు చూస్తుండగానే నాగారం గ్రామానికే చెందిన రాజును దుండగులు వేటకొడవళ్లతో నరికి చంపారు. వేటాడి వెంబడించి హత్య చేశారు.

హత్యకు గురైన రాజు రెండేళ్ల కింద ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడు. నాగారం గ్రామానికి చెందిన రాజు, కృష్ణ చిన్ననాటి నుంచి స్నేహితులు. రెండేళ్ల కింద రాజు, కృష్ణ కలిసి కొత్తూరు గ్రామానికి వెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు మాత్రం రాజు ఒక్కడే వచ్చాడు. కృష్ణ కుటుంబ సభ్యులు రాజును అడిగితే సమాధానం దాట వేశాడు. తనకు తెలియదని చెప్పాడు. అదే రోజు కృష్ణ మృతదేహం అనుమానాస్పద రీతిలో కొత్తూరు రైల్వే ట్రాక్‌పై పడి ఉంది. దీంతో కుటుంబ సభ్యులు మహేశ్వరం పోలీసులకు రాజుపై ఫిర్యాదు చేశారు. మహేశ్వరం పోలీసులు కృష్ణది హత్యగా తేల్చి రాజును అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. బెయిల్‌పై బయటకు వచ్చిన రాజు ఊరికి దూరంగా కుటుంబంతో కలిసి షాద్‌నగర్‌లో ఉంటున్నాడు.

ఈ ఉదయం రాజు తన తండ్రితో కలిసి సొంతూరైన నాగారం గ్రామానికి చేరుకున్నాడు. గతంలో హత్యకు గురైన కృష్ణ కుటుంబ సభ్యులు రాజు ఊర్లోకి వస్తున్నాడన్న సమాచారం తెలుసుకుని వేటకొడవళ్లు, గొడ్డళ్లతో గ్రామ శివారులో మకాం వేశారు. నాగారం ఊళ్లోకి రాజు, అతడి తండ్రి రాగానే ప్రత్యర్థులు వెంబడించారు. రాజు తప్పించుకునేందుకు నాగారం ప్రధాన కూడలిదాకా పరిగెత్తాడు. వెంబడించిన ప్రత్యర్థులు నాగారం కూడలిలో రాజును వేటకొడవళ్లతో నరికి హతమార్చారు.

మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ఇటీవలే అత్తాపూర్‌లో అందరూ చూస్తుండగానే జరిగిన హత్య ఘటన దుమారం రేపింది. హత్యకు హత్యే సమాధానమవుతుండటంపై ఆందోళన వ్యక్తమౌతోంది. ప్రత్యర్థిని వెంటాడి వేటాడి మరీ చంపుతున్నారు. చట్టానికి సైతం భయపడటం లేదు. పోలీసులు ఉన్నా బెదరడం లేదు. ప్రతీకారం తీర్చుకుంటూనే ఉన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*