కేసిఆర్‌కు ఉత్తమ్ ఘాటు లేఖ

తేది 10.10.2018

హైద‌రాబాద్‌

గౌరవనీయులైన అపద్దర్మ ముఖ్య‌మంత్రి కేసిఆర్ గారికి, నమస్కారములు..

మీ మేన‌ల్లుడు అప‌ద్దర్మ మంత్రి హ‌రీష్ రావు గారు నాకు రాసిన లేఖ‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని తేల్చేశారు. చంద్ర‌బాబుతో  పొత్తు వల్ల రేపటి మీ ప్రభుత్వంలో అంటు ముందుగానే మా కాంగ్రెస్  ప్రభుత్వం ఏర్పడుతుందని తేల్చి చెప్పినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాను. అందుకు  మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హ‌రీష్ రావు లేఖ ద్వారా మీరు ఇప్ప‌టి వ‌ర‌కు చెప్పిన  టిఆర్ ఎస్ వంద సీట్లు అనే క‌ల చెదిరిపోయింది. మీరు ఇక ఫామ్ హౌజ్‌కు ప‌రిమిత‌మ‌య్యే స‌మ‌యం వ‌చ్చింది. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు స్వేచ్చ రాబోతోంది. ఒక ప్ర‌జాస్వామిక, ప్ర‌జ‌ల ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌బోతోంది. . తెలంగాణ‌లో కాంగ్రెస్ గెలుపు, టిఆర్ఎస్ ఓట‌మిని మీరు ముందుగానే అంగీక‌రించినందుకు ధ‌న్య‌వాదాలు.

ఇక హ‌రీష్ రావు రాసిన లేఖ తెలంగాణ పట్ల మీకున్న అజ్క్షానాన్ని బహిర్గతం చేస్తుంది. తెలంగాణ ఉద్యమంలో ఉన్నామని, ఏదో పొడిచామని చెప్పకుంటున్న మీరు, లేఖలో రాసిన అంశాలను చూస్తే ఇంత తెలివి తక్కువగా ఉద్యమంలో ఎలా ఉన్నారో, ఇంత తెలివి త‌క్కువ ముఖ్య‌మంత్రిగా ఎలా పాలించారో అని జాలి వేస్తుంది. మా ప్రజా కూటమి పొత్తు గురించి మీరు పడుతున్న ఆందోళన చూస్తుంటే మీ పాలన పట్ల ప్రజలలో ఎంత వ్యతిరేకత ఉందో అర్థం అవుతుంది. మీ పాలన బాగుంటే మీరు ప్రజల కోసం ఈ నాలుగురన్న ఏళ్ళ పాటు పనిచేసి ఉంటే మేము ఎవరితో పొత్తు పెట్టుకుంటే మీకు ఎందుకు ఆందోళన ?

మీరు 2004లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు, అప్పడు కాంగ్రెస్ విజయం సాధించింది. అలాగే మీరు 2009లో మ‌హాకూట‌మి అంటు టిడిపితో పొత్తు పెట్టుకున్నారు. అయినా కాంగ్రెస్ విజయం సాధించింది. మీరు 2009లో టిడిపితో పొత్తు పెట్టుకున్నప్పడు టిడిపి తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిందని తేల్చిచెప్పారు. 2009లో లేఖ ఇచ్చింది కాబట్టి మీరు పొత్తు పెట్టుకున్న తరువాత టిడిపి ఎలా తెలంగాణ వ్యతిరేక పార్టీ అయిందో చెప్పలేదు. ఇకపోతే నీళ్ళు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్ లైన్తో తెలంగాణ ఉద్యమం జరిగింది. మీరు తెలంగాణ ఉద్యమం పేరుతో నలుగురు మీ కుటుంబ స‌భ్యులు తెలంగాణను దోచుకున్నా.. యువత, విద్యార్థి, సబ్బండ వర్గాల ఉద్యమాన్ని గౌరవించి, అమరవీరుల త్యాగాలకు చలించి సోనియమ్మ, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే అన్నింటికి పరిష్కరమని పదే పదే మీరు చెప్పిన  విషయాలు మీకు గుర్తు లేవా.. తెలంగాణ వచ్చి నాలుగున్నర ఏళ్ళ పాటు మీరు పాలించి,  జనాన్ని 6 శాతం పర్సెంటేజ్ (మిస్టర్ 6%) కమీషన్లు తీసుకొని తెలంగాణ సంపదను అంతా దోచుకొని ఇప్పడు మూఢ నమ్మకాలతో ముందుగానే పాలన చేతకాక దిగిపోయి ఇప్పడు ఎన్నికలంటే భయపడుతు మా పొత్తులపై మీరు ఆందోళన చెందుతున్నారు.

ఆ లేఖతోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న విషయం తేలిపోయింది. ఇక పొత్తులు షరతులా, షరమ్ లేని పొత్తులా అంటు మీరు ప్రశ్నించారు. షరమ్ లేని పొత్తులు పెట్టుకుంది మీరు, 2009లో మీరు ఇప్పడు ఆంధ్రా పార్టీ అని మొత్తుకుంటున్న టిడిపితో పొత్తు పెట్టుకున్నారు. అంతేకాదు తెలంగాణను బద్ద విరుద్దంగా వ్యతిరేకించి సిపిఎంతో కూడా పొత్తు పెట్టుకున్నారు. మరి అప్పుడు మీది షరమ్ లేని పొత్తా.. ? అధికారంలోకి వచ్చాక సిగ్గులేకుండా రాజకీయ ఫిరాయింపులకు పాల్పడి టిడిపికి చెందిన తలసాని శ్రీనివాస్ లాంటి వాళ్ళకు మంత్రి పదవి ఇచ్చారు. మరి అప్పడు ఆయన టిడిపి ఎం.ఎల్.ఎ అనే విషయంలో గుర్తుకు రాలేదా.. తెలంగాణ ద్రోహులుగా ముద్ర పడ్డ మహేందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు లాంటి వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చినపుడు షరమ్ గుర్తుకు రాలేదా..?  తెలంగాణ వాదులను తరిమికొట్టిన మైనంపల్లి హన్మంతరావు, దానం నాగేంద‌ర్‌, తీగల కృష్ణారెడ్డి తదితరులను పార్టీలో చేర్చుకొని పెద్ద పీట వేసినప్పడు ఏమైంది మీకు సిగ్గు అనిపించలేదా. ?  తెలంగాణ వ్యతిరేకించిన ఎం.ఐ.ఎంతో పొత్తు పెట్టుకున్నప్పడు,  తెలంగాణను ఒప్పుకోము, రాయల తెలంగాణ కావాలని డిమాండ్ చేసిన ఎంఐఎం ను మా స్నేహ పార్టీ అని మీరు చెప్పకున్నప్పుడు మీకు ష‌ర‌మ్ లేదా . ?

ఇక టిడిపితో పొత్తు ఎందుకు అంటున్నారా.. ఆ ప్ర‌శ్న అడిగే హ‌క్కు మీకు లేదు., అయినా చెబుతున్నాను, తెలంగాణ ఏర్పడిన తరువాత ఒక ప్రజాస్వామిక వాతావరణం ఏర్పడుతుందని అంతా భావించాము. దేశంలోనే ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా ఏర్పడుతుందని, అభివృద్ది, సంక్షేమం దిశగా తెలంగాణ ముందుకు సాగుతుందని, ధనిక రాష్ట్రంగా సకల జనులకు అవసరమైన పథకాలను అమలు చేస్తుందని భావించాము. కానీ నేడు తెలంగాణ అంటే దేశంలో ముందుగా గుర్తుకువచ్చేది రైతుల ఆత్మహత్యలు, రెండు లక్షల కోట్ల అప్పులు, లక్ష కోట్ల అవినీతి, అబద్దాలు, అత్యాచారాలు, నేరాలలో నెంబర్ వన్, రాజకీయ ఫిరాయింపులలో, రాజ్యంగ విరుద్దమైన పనులు, ప్రజాస్వామ్య వాదులను, శాంతియుత పోరాట శక్తులను నిర్బంధించిన విషయాలే  గుర్తుకు తెస్తుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఒంటిరిగా పోటీ చేసినా టిఆర్ ఎస్ ను  చిత్తుగా ఓడించే సత్తా ఉంది. కానీ టిఆర్ ఎస్ నామారూపాల్లేకుండా చేసి తెలంగాణలో మళ్ళీ అడ్రస్ లేకుండా చేయాలనే ఉద్దేశ్యంతో ఒక ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తెలంగాణను రక్షించేందుకు కొన్ని సిద్దాంత సారుప్యత ఉన్న పార్టీలో పొత్తులు పెట్టుకుంటున్నాము.

అయినా మేము ఎవరితో పొత్తు పెట్టుకుంటే మాకేంది అని మీరే గతంలో అన్నారు, మేము ఎవరితో పొత్తు పెట్టుకుంటే మీకేంటి, మేము ప్రజలకు జవాబు దారులం, మాకు ప్రజలకు జవాబు చెప్పుకునే శక్తి ఉంది. మీరు మా పొత్తుల విషయంలో ఎందుకు అంతగా భయపడుతున్నారు. ? చంద్రబాబు గారు తెలంగాణ అభివృద్దిని అడ్డుకుంటున్నారంటు మీ అల్లుడు మంత్రి హ‌రీష్ రావు అన‌డం మీ చేతకాని తనానికి, రాష్ట్ర ప్రయోజనం పట్ల మీ చిత్తశుద్ది లేమికి పరాకాష్టగా చెప్పవచ్చు. చంద్రబాబులో ఏమైనా మార్పు వచ్చిందా అంటున్నారు. ఏ మార్పు వచ్చిందని చంద్రబాబును మీరు చండియాగానికి ముఖ్య అతిధిగా పిలిచి సన్మానించారు ? ఏ మార్పు వచ్చిందని మీరు అమరావతికి వెళ్ళి చంద్రబాబు ఇంట్లో చేపల పులుసు తిని వచ్చారు. ఏ మార్పు వచ్చిందని మీరు పరిటాల రవి కొడుకు పెళ్ళికి పోయి టిడిపి నేతలతో రహస్య మంతనాలు జరిపారో ముందుగా చెప్పండి. మీరు చేస్తే అది సంసారం అవుతుంది, మేము పొత్తు పెట్టకుంటే ద్రోహం అవుతుందా… ఇదెక్కడి న్యాయమో ?

సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యోగుల విభజన, కరెంట్, పోలవరం, ప్రభుత్వ సంస్థల విభజన, హైకోర్టు విభజన లాంటి అంశాలు ప్రస్తావించారు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండేవి, ఆ మాత్రం మీకు తెలియదా… మీరు మోడి భజనలో మునిగి తేలుతున్నారు, ఆయనకు వంగి వంగి సలాములు కొడుతున్నారు కదా, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్, నోట్ల రద్దు, జి.ఎస్.టి లాంటి అనేక కీలక అంశాలలో మీరు ఏ బిజెపి రాష్ట్రం కంటే ముందే ఎగబడిపోయి మద్దతు ఇచ్చారు కదా, మరి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మోడీతో ఎందుకు పనులు చేయించలేకపోతున్నారు, కేసిఆర్ సహారా సిబిఐ కేసులక భయపడి మోడి ముందు మోకరిల్లారా.. ?  మోడికి చంద్రబాబు మద్దతు ఉపసంహరించుకుని కేంద్ర ప్రభుత్వంపైన అవిశ్వాసం ప్రకటించినపుడు మన రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల విషయంలో మీరు ఎందుకు మోడీతో పోరాటాలు చేయలేదు. ఎందుకు అవిశ్వాసానికి మద్దుతు ఇవ్వలేదు, ఎందుకు అవిశ్వాసం చర్చకు రాకుండా అడ్డుకున్నారు. ఇవన్నీ మీరు, బిజెపి కలిసి తెలంగాణకు చేసిన ద్రోహం కాదా.. ?

ఖమ్మంలో ఏడు మండలాలను చంద్రబాబు గుంజుకున్నాడని సిగ్గులేకుండా చెబుతున్నారు, తెలంగాణ సాధించామని గొప్పలు చెప్పుకుంటున్న మీరు ఏడు మండలాలు పోతుంటే పోరాటాలు చేయలేరా.. చంద్రబాబు గుంజుకుంటుంటే చేతులు ముడుచుకొని చేవలేని దద్దమ్మలా కూర్చున్నారా. ?  నిరంతరం విద్యుత్ అందించే 460 మెగవాట్ల సిలేరు విద్యుత్ ప్రాజెక్టు ఆంద్రాలో కలుస్తుంటే, లక్షలాది ఎకరాలలో దేవాలయ, అటవీ భూములు ఆంద్రాలో కలుస్తుంటే కళ్ళు మూసుకొని ఫామ్ హౌజ్లో పండుకున్నారా ? పోలవరం ప్రాజెక్టు 150 మీటర్ల ఎత్తులో కడుతున్నారని, 50 లక్షల క్యుసెక్కుల ప్రవాహ నీటి సామర్థ్యంతో డ్యామ్ నిర్మించాలని ప్రతిపాదించారని అంటున్నారు, మీరు ముఖ్య‌మంత్రిగా ఉండి ఏమి చేస్తున్నారు, అకిలపక్ష్యాన్ని డిల్లీ తీసుకెళ్ళి పోరాడాలి కదా, ఫెడరల్ స్పూర్తి గా తీసుకొని కేంద్రం వద్ద పంచాయతీ పెట్టి ఒప్పించాలి కదా, మహారాష్ట్రతో గొప్ప ఒప్పందాలు చేసుకున్నామని, గాడిదల మీద ఊరేగి గొప్పలు చెప్పకున్న మీరు, పక్క ఉన్న మరో తెలుగు రాష్ట్రంతో ఒప్పందాలు చేసుకోలేరా.. ఇదేనా మీ తెలివి.. దద్దమ్మలా.. సన్యాసులా.. ?  ఆయ‌న ఒక ముఖ్య‌మంత్రి, మీరు ఒక ముఖ్య‌మంత్రి ఆయ‌న గుంజుకున్నాడ‌ని అంటున్నారంటే మీరు ముఖ్య‌మంత్రిగా ఏమి చేయ‌లేని ద‌ద్ద‌మ్మ అని ఒప్ప‌కుంటున్న‌ట్టే క‌దా. ?

పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపాలని చంద్రబాబు 30 లేఖలు రాశారని మీరు చెప్పడం మీ చేతకాని తనానికి పరాకాష్ట. తెలంగాణ ఎగువ రాష్ట్రం, మనం కడుతుంటే చంద్రబాబు ఎలా ఆపుతారో మీరే చెప్పాలి, మనపైన ఉన్న కర్ణాటక, మహరాష్ట్రలు కడుతుంటే మనం ఎలా కేంద్రం వద్ద పంచాయతీ పెడుతున్నామో అలాగే చంద్రబాబు కూడా కేంద్రం వద్ద పంచాయతీ పెట్టుకోవాలి, కేంద్రం వద్ద మనకు కోట్లాడే శక్తి లేదా.. లేదా మీరు చేవలేని సన్నాసులమని ఒప్పుకుంటున్నారా.. ప్రాజెక్టుల కట్టడం చేతకాని మీరు చంద్రబాబు ఒంక చూపి ఆపాలని చూస్తే తెలంగాణ ప్రజలు మీ అడ్డమైన తెలివిని అర్థం చేసుకోలేనంత అసమర్థులు కారు.. ?

గోదావరి, కృష్ణ నదులపైన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో 86 ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాము. ఇప్పడు మీరు చెబుతున్న ప్రాజెక్టులు కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్టులే. మనం కడుతుంటే పైన ఉన్న రాష్ట్రాలు ఫిర్యాదులు చేశాయి, మరి మన దిగువన ఉన్న రాష్ట్రం ఫిర్యాదులు చేస్తే మనకు చిత్తశుద్ది ఉంటే ఎందుకు ఆపుతాము. కేంద్రం వద్ద పోరాడి ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టాలి. ఇది చేతకాకపోతే క్షమాపణ చెప్పి తప్పుకోవాలి. పోలవరం ప్రాజెక్టు నిర్మించి గోదావరి నీటిని కృష్ణ బేసిన్‌కు త‌ర‌లించ‌డం  వల్ల ఎగువ రా|ష్టాలకు  80 టిఎంసీల వాటా ఇవ్వాలని తెలంగాణకు 45 టి.ఎం.సీల నీరు రావాలని కానీ ఇది చంద్రబాబు అడ్డుకుంటున్నారని మీరు అనడం మీ చేతకాని దద్దమ్మ చేష్టలకు పరాకాష్ట, ఎగువ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ నీటిని వదిలితేనే ఆంద్రప్రదేశ్‌కు నీరు  పోతాయి, మరి చంద్రబాబు మన నీటిని ఎలా అడ్డుకుంటారో అర్థం కావడం లేదు. దిగువన్న ఉన్న చంద్రబాబు మన నీటిని అడ్డుకుంటున్నారని మీరు అంటున్నారంటే మీ చేతకాని తనం, చంద్రబాబు పాలనా దక్షత ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీ తెలివి తక్కువ తనం చూసి తెలంగాణ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

మిషన్ భగీరథపైన చంద్రబాబు ఏమని ఫిర్యాదు చేశారో తెలియదు కానీ, మిషన్ భగీరథ అనే ప్రాజెక్టు పెద్ద అక్రమ ప్రాజెక్టు, కమీషన్ల కోసం చేపట్టిన ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు పేరు మీద వేల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి కమీషన్లు కొల్లగొట్టారు, మిషన్ భగీరథ ఇంటింటికి నీరు ఇవ్వకపోతే ఓట్లు అడగమని గతంలో కేసిఆర్ అన్నారు, మరి ఇప్పడు ఇంటింటికి నీరు వచ్చిందా ? అదొక పెద్ద బోగస్ ప్రాజెక్టు, అయినా తెలంగాణలో మిషన్ భగీరథ  ప్రాజెక్టును చంద్రబాబు అడ్డుకుంటున్నారని మీరు అంటున్నారంటే మీరు ఎంత దద్దమ్మలో, పాలనలో ఎంత వైఫల్యం చెందారో అర్థం అవుతుంది. సీలేరు ప్రాజెక్టు 460 మెగావాట్లను ఆంద్రప్రదేశ్ తీసుకుందని, 5 వేల కోట్ల విలువైన ప్రాజెక్టుని, రోజుకు కోటి రూపాయల ప్రాజెక్టు అని చెబుతున్న మీరు ఈ విషయంలో ఇప్పటి వరకు ఎక్కడైనా ఫిర్యాదు చేశారా, కేంద్రంలో బిజెపికి అంటగాగుతున్న మీరు ఒక్కసారైనా మోడీతో ఈ విషయాన్ని ప్రస్తావించారా, మీ ఎంపిలు డిల్లీలలో గడ్డి పీకుతున్నారా.. ? అనేక సందర్భాలలో బిజెపికి మద్దతు ఇచ్చిన మీరు ఒక్కసారైనా సీలేరు మాకు ఇవ్వమని బిజెపిని అడిగారా ?  మోడీ గజ్వెల్ లో మేము చేపట్టిన గోదావరి పథకాన్ని ప్రారంభించిన సందర్భంలో మీ మనసులో మాపై ప్రేమ ఉంటే చాలునని అన్నారు, కదా మరి అప్పడు ఎందుకు ఆ విషయాలను ప్రస్తావిస్తున్నారు.

మీరు సందించిన 12 ప్రశ్నలలో ఒక్కటి తెలంగాణ ప్ర‌జ‌ల‌కు పనికొచ్చే ప్రశ్నలేదు, స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డే ప్ర‌శ్న లేదు. అవన్నీ మీ చేతకాని తనాన్ని, మీ అసర్థతను, మీ పాలనా వైఫల్యాలను, మీ ద‌ద్ద‌మ్మ వేషాల‌ను బయటపెడుతున్నాయి,  రాజకీయాలలో పొత్తులు, కూటమిలు అతి సహజంగా జరుగుతున్నాయి, మీరు అధికార పక్షంలో ఉండి ప్రతిపక్షాల ఐక్యతను చూసి భయపడుతున్నారంటేనే మీ ఓటమిని ఒప్పుకున్నట్టు లెక్క,  కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం, మీ ఓటిమి ఖాయం. మేము ప్రజలకు జవాబు దారులం, ప్రజలకు మేము సమాధానం చెబుతాం.

మీ

ఉత్తమ్ కుమార్ రెడ్డి

టిపిసిసి అధ్యక్షులు..

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*