ప‌ద్మినీ యూ ట‌ర్న్‌కు కార‌ణ‌మేంటీ ?.. ఆ 9 గంట‌ల్లో ఏం జ‌రిగింది ?.. ఎక్క‌డ ప్లాన్ బెడిసికొట్టింది ?

హైదరాబాద్: దామోదర రాజ‌న‌ర్సింహ్మా. సీనియ‌ర్ కాంగ్రెస్ నేత‌. ఉమ్మ‌డి రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ప‌నిచేశారు. రాష్ట్ర‌ రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ప్ర‌స్తుతం మ్యానిఫెస్టో క‌మిటీ ఛైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. ఆయన భార్య ప‌ద్మినీ రెడ్డి. ఆమె సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెల‌వాల‌ని ఆశ‌ప‌డ్డారు. అందుకు దామోద‌ర రాజ‌న‌ర్సింహ్మ కూడా అంగీక‌రించారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి మెద‌క్ ఎంపీ ఉప ఎన్నిక‌ల సంద‌ర్భంగా బీజేపీ గూటికి వెళ్లిన సంద‌ర్భంలో సంగారెడ్డి లైన్ క్లియ‌ర్ అయ్యింద‌ని దామోద‌ర భావించారు. అంత‌లోనే మ‌ళ్లీ జ‌గ్గారెడ్డి కాంగ్రెస్‌లోకి రావ‌డం.. సీటుపై క్లియ‌రెన్స్ తెచ్చుకోవ‌డంతో దామోద‌ర రాజ‌న‌ర్సింహ్మా భార్య‌కు ఇచ్చిన మాట నిల‌బెట్టుకోవ‌డం ఇబ్బందిక‌రంగా మారింది.

మరోవైపు ఏదో విధంగా సంగారెడ్డి ఎమ్మెల్యే కావాల‌న్న ఉద్దేశ్యంతో బీజేపీలో చేరిపోవాల‌ని ప‌ద్మినీరెడ్డి ఆవేశంగా నిర్ణ‌యం తీసుకున్నారు. చెరో పార్టీలో ఎమ్మెల్యేలుగా గెల‌వ‌వ‌చ్చ‌ని భార్యాభర్తలు భావించినట్లు తెలుస్తోంది. అనుకున్న‌ట్లుగానే దామోద‌ర రాజ‌న‌ర్సింహా స‌తీమ‌ణి క‌మ‌లం పార్టీలో చేరారు. అంత‌లోనే మ‌ళ్లీ యూ ట‌ర్న్ తీసుకున్నారు. కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే మ‌నసు మార్చుకున్నారు.

అక్టోబ‌ర్ 11వ తేదీన మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు బీజేపీ తీర్ధం పుచ్చుకున్న ప‌ద్మినీరెడ్డి.. అదే రోజు రాత్రి 9 గంట‌లకు క‌మ‌లానికి గుడ్ బై చెప్పారు. ప‌ద్మినీ రెడ్డి మ‌న‌సు మార్చుకోవ‌డానికి కార‌ణ‌మేంటీ అన్న దానిపై సోష‌ల్ మీడియాలో విస్తృతంగా చ‌ర్చ‌జ‌రుగుతోంది.

దామోద‌ర ప్లాన్‌కు మ్యానిఫెస్టో క‌మిటీ ఛైర్మ‌న్ ప‌ద‌వి ఇబ్బందిక‌రంగా మారింది. క‌మ‌లం కండువా ప‌ద్మినీ క‌ప్పుకోగానే సోష‌ల్ మీడియాలో దామోద‌ర‌పై సెట‌ర్లు మొద‌ల‌య్యాయి. ఇంట్లో భార్య‌నే మ్యానిఫెస్టోను న‌మ్మ‌డం లేదు.. ఇక ప్ర‌జ‌లేం న‌మ్ముతార‌ని ప్ర‌చారం జ‌ర‌గ‌డంతో దామోద‌ర రాజ‌న‌ర్సింహ్మా మ‌న‌స్థాపం చెందారు. స్వయంగా హరీశ్ రావు సహా నేతలందరూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

విమర్శలు తీవ్రమవుతుండటంతో అసలుకే మోసం వస్తుందనుకున్నారో ఏమో.. దామోదర భార్య మ‌న‌సు మార్చి బీజేపీకి గుడ్ బై చెప్పించారు. మొత్తానికి మ్యానిఫెస్టో క‌మిటీ ఛైర్మ‌న్ ప‌ద‌వి భార్య ఎమ్మెల్యే ప‌ద‌వికి అడ్డంకిగా మారింది.

ప్రశస్తి, జర్నలిస్ట్, హైదరాబాద్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*