
హైదరాబాద్: కొత్తగా పార్టీలో చేరిన వారికి కేసీఆర్ ఇచ్చే ట్రీటే వేరు. ఆలింగనాలు.. హత్తుకోవడాలు.. పొగడ్తలు.. పక్కన కూర్చొబెట్టుకుని అందరిలో ముచ్చట్లు చెప్పడం ఎంతటి వారైన కరిగిపోవల్సిందే. చంద్రన్న మర్యాదకు ఫ్లాటయ్యి మోసపోయిన వారి జాబితా చాలానే ఉంది. ఆలే నరేంద్ర నుంచి మొదలుకుని.. ఇప్పుడు మదనపడుతున్న కే.కేశవరావు వరకు కేసీఆర్ మర్యాద తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తాజాగా కే.ఆర్.సురేశ్‌రెడ్డిని టీఆర్ఎస్ గూటికి చేరడం అక్కడ కేసీఆర్ దగ్గర మర్యాదకు ఆయన ఫిదా అయిపోయారు. ఇంత వరకు బాగానే ఉంది. భవిష్యత్తులో ఆయనకు ఏదోరోజు మూడుతుందోనని కాంగ్రెస్ సీనియర్ నేతలు గుసగుసలాడుతున్నారు.
దానం నాగేందర్ పరిస్థితి కూడా అంతంత మాత్రమే. టీఆర్ఎస్ పార్టీలో చేరేటప్పడు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. తీరా ఇప్పుడు ఖైరతాబాద్ టికెట్ వస్తుందో లేదోననే అనుమానాలు. ఏదో ఒక రోజు దానం నాగేందర్ పరిస్థితి కూడా అంతేనని కాంగ్రెస్ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.
ఆలె నరేంద్ర, విజయశాంతి లాంటి వారి పార్టీలను టీఆర్ఎస్లో విలీనం చేసుకున్న కేసీఆర్ వాళ్లను పార్టీ నుంచి బయటకు పంపించారు. అంతెందుకు ఆయన దగ్గర పనిచేసిన దిలీప్ కుమార్ లాంటి వారు కూడా ఆయనతో ఉండలేకపోయారు. విజయశాంతిని పదో చెల్లిగా ఆయన వర్ణించారు. పీసీసీ చీఫ్‌గా పనిచేసిన డీ.శ్రీనివాస్ కూడా కేసీఆర్ లిస్ట్‌లో చేరిపోయారు. పొమ్మనలేకపొగబెట్టి ఇబ్బందికర వాతావరణం ఆయనకు సృష్టించారు. కొండా సురేఖ లాంటి నేతలు కూడా కేసీఆర్ ట్రీట్ అందుకుని మోసపోయారు.
కేశవరావు కేసీఆర్ ట్రీట్‌లో భాగమైపోయారు. టీఆర్ఎస్లో ఉండలేక ఇబ్బందికర వాతావరణాన్ని ఎదుర్కొంటున్నారు. తన కూతురు విజయలక్ష్మీకి టికెట్ ఇప్పించుకోలేని దురావస్థలో ఉన్నారు.
మొత్తానికి ఇటీవల చేరిన కే.ఆర్.సురేశ్‌రెడ్డికి కేటీఆర్ స్వయంగా తీసుకుని వెళ్లి పార్టీలో చేర్చుకోవడం వరకు ఓకే. పాలమూరు జిల్లాలో నిర్వహించిన వనపర్తి సభకు సురేశ్‌రెడ్డిని తన హెలికాప్టర్లో తీసుకెళ్లిన కేసీఆర్ ఆయనకు మంచి ప్రాధాన్యతనే ఇచ్చారు. అది ఎన్నాళ్లు ఉంటుందో వేచిచూడాలి. ఇంకా కాంగ్రెస్ టికెట్ల ప్రకటన తర్వాత కేసీఆర్ మర్యాద రామన్న జాబితాలో మరింత మంది చేరే అవకాశముంది.
ప్రశస్తి, జర్నలిస్ట్, హైదరాబాద్
Be the first to comment