ఐటీ దాడులపై జనసేనాని హాట్ కామెంట్స్

అమరావతి: ఇకపై అమరావతి కేంద్రంగా జనసేన కార్యకలాపాలు ఉంటాయి. ఇకపై ఈ కార్యాలయంలోనే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఇతర నేతలు అందరికీ అందుబాటులో ఉంటారు. అమరావతిలో జనసేన రాష్ట్ర కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. జనసేన పార్టీలో నిన్న చేరిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ ఈ కొత్త కార్యాలయ ప్రారంభోత్సవానికి విచ్చేశారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ శ్రీకాకుళంలో తుపాను బీభత్సం దురదృష్టకరమన్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ప్రభుత్వం సహాయ చర్యలను ముమ్మరం చేయాలని సూచించారు. జనసేన కవాతు తర్వాత ఈ నెల 17న శ్రీకాకుళంలో పర్యటిస్తానని పవన్ చెప్పారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించనున్నారు.

ఐటీ దాడులు సచివాలయం, సీఎం ఇంటిపై జరిగితే ప్రభుత్వానికి అండగా ఉంటామని పవన్ చెప్పారు. వేరే వ్యాపారులపై ఐటీదాడులకు, టీడీపీకి ఏం సంబంధమని పవన్ ప్రశ్నించారు. నిన్న టీడీపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేశ్ నివాసాలు, వ్యాపార సంస్థలపై ఇన్‌కమ్ టాక్స్ శాఖ దాడులు నిర్వహించింది. హైదరాబాద్‌లోని సీఎం రమేష్‌ నివాసం, ఆఫీసుల్లో ఐటీ తనిఖీలు కొనసాగాయి. కడప జిల్లా పోట్లదుర్తిలోని సీఎం రమేష్‌ నివాసంలోనూ సోదాలు జరిగాయి. సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్ సంస్థపై దాడులు జరిగాయి. ఏకకాలంలో 60 మంది ఐటీ అధికారులు తనిఖీలు జరిపారు. ఈ తరుణంలో పవన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.

హోదాపై సీఎం మాట మార్చడం వల్ల ప్రజలు గందరగోళానికి గురౌతున్నారని పవన్ చెప్పారు. హోదాపై అఖిలపక్ష మీటింగ్ పెడితే కలిసి వస్తామన్నారు. అఖిలపక్ష నాయకులంతా ప్రధాని మోదీని కలవాలని పవన్ సూచించారు. తెలంగాణ ఎన్నికల్లో 23 లేదా 24 స్థానాల్లో పోటీచేయాలనుకున్నామని అయితే తెలంగాణ ఎన్నికలు త్వరగా వచ్చాయని, పోటీపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*