టీఆర్ఎస్ మేనిఫెస్టోలో జర్నలిస్ట్‌లకు ఇళ్ల స్థలాల అంశం?

హైదరాబాద్: రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్ట్‌లందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశాన్ని టీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో పెట్టాలని టీయూడబ్ల్యూజే డిమాండ్ చేసింది. టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ నేతృత్వంలో టీయూడబ్ల్యూజే జర్నలిస్టుల బృందం టీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావును కలిసింది. వర్కింగ్ జర్నలిస్ట్‌లందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశాన్ని పరిశీలించి జర్నలిస్టులకు న్యాయం చేయాలని సూచించింది. కేశవరావును కలిసిన బృందంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర కోశాధికారి అస్కాని మారుతీ సాగర్, టీయూడబ్ల్యూజే హైదరాబాద్ సిటీ అధ్యక్షుడు పి. యోగానంద్, టిఈఎమ్‌జేయూ రాష్ట్ర అధ్యక్షుడు ఇస్మాయిల్, టిఈఎమ్‌జేయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ. రమణ కుమార్, TPJA అధ్యక్షుడు భాస్కర్ తదితరులున్నారు.

ఐదు ప్రధాన డిమాండ్లు ఇవే

1. వర్కింగ్ జర్నలిస్ట్ లు అందరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి.
2. రిటైర్డ్ జర్నలిస్ట్ లకు పెన్షన్ స్కీం అమలు చేయాలి.
3. ప్రైవేట్ స్కూల్స్ లో జర్నలిస్ట్ ల పిల్లలకు ఉచిత విద్య అందిచాలి.
4. జర్నలిస్టు లకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.
5.చిన్న పత్రికలకు ప్రకటనలు పెంచడం ద్వారా ఆర్ధికంగా ప్రోత్సహించాలి.

టి.ఆర్.ఎస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఈ ఐదు ప్రధాన అంశాలను చేర్చడంతో పాటు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన మీడియా అకాడమీ కి 100 కోట్ల నిధిని సమకూర్చడం లో భాగంగా..35 కోట్లను సమకూర్చారు. మరో 65 కోట్లను సంక్షేమ నిధికి సమకూర్చాలని బృందం కోరింది.

టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, అక్రిడేషన్లు పెద్ద సంఖ్యలో ఇచ్చింది. జర్నలిస్టుల సంక్షేమానికి చర్యలు చేపట్టింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఇళ్ల స్థలాల అంశాన్ని కూడా సీరియస్‌గా పరిశీలించాలని టీయూడబ్ల్యూజే టీఆర్ఎస్ పార్టీని కోరింది. ప్రస్తుతం టీఆర్ఎస్ మేనిఫెస్టో రూపుదిద్దుకుంటోంది. ఈ తరుణంలో మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేరిస్తే ప్రభుత్వం తప్పకుండా నెరవేర్చాల్సి ఉంటుంది. టీయూడబ్ల్యూజే కోరిక మేరకు టీఆర్ఎస్ తమ పార్టీ మేనిఫెస్టోలో వర్కింగ్ జర్నలిస్ట్‌లందరికీ ఇళ్ల స్థలాల అంశాన్ని చేర్చే అవకాశం ఉంది.

తెలంగాణ అసెంబ్లీకి డిసెంబర్ ఏడున ఎన్నికలు జరగనున్నాయి. అదే నెల 11న ఫలితాలు విడుదల కానున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*