తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో లోకేశ్ పర్యటన.. అధికారులకు ఆదేశాలు

శ్రీకాకుళం: తిత్లీ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ మంత్రి నారా లోకేశ్ పర్యటించారు. మందస గ్రామంలో పర్యటించిన ఆయన ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. మందసలో ఉన్న ప్రధాన పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన ఆయన పరిశీలించారు. పంపిణీ కేంద్రంలో సరకుల సరఫరా వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సాయంత్రం లోపు అన్ని గ్రామాల్లో పంపిణీ కార్యక్రమం పూర్తి అవ్వాలన్నారు.

గ్రామాల్లో విద్యుత్ పునరుద్ధరణ వేగంగా జరగాలని లోకేశ్ ఆదేశించారు. వెంటనే గ్రామాలకు వెళ్లి సమస్యలు పరిష్కరించాలి అని అధికారులను ఆదేశించారు. ఈ రోజు నుంచి రేషన్ షాపుల్లో ఉచితంగా బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయల పంపిణీ చేయాలని సూచించారు. ప్రతీ కుటుంబానికి 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, లీటర్ నూనె, కిలో బంగాళాదుంపలు, కిలో ఉల్లిపాయలు, అరకిలో చెక్కర పంపిణీ చేయాలని ఆదేశించారు.

మత్స్యకార గ్రామాల్లో కుటుంబానికి 50 కిలోల బియ్యం పంపిణీ చేయాలని లోకేశ్ ఆదేశించారు. గ్రామాల్లో నిరంతరం తాగునీరు సరఫరా కొనసాగాలని సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు జరపాలని, అన్ని గ్రామాల్లో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో భోజన సదుపాయం కల్పించాలని లోకేశ్ సూచించారు.

వాస్తవానికి లోకేశ్ అమెరికాలో పర్యటించాల్సి ఉంది. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ తీసుకోవాల్సి ఉంది. అయితే తిత్లీ తుపాను నేపథ్యంలో ఆయన తన అమెరికా పర్యటనను రద్దు చేసుకుని తుపాను బాధితులను పరామర్శిస్తున్నారు. సహాయక చర్యలను సమీక్షిస్తున్నారు.

తిత్లీ తుపాను బాధితులను ఆదుకునేందుకు పౌరులు ముందుకు రావాలని లోకేశ్ పిలుపునిచ్చారు.

ప్రభుత్వ పిలుపు మేరకు పౌరులు, స్వచ్ఛంద సంస్థలు, సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. తుపాను బాధితులకు విరాళాలు ప్రకటిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*