
అక్కడి నుంచి ఫోన్ కాల్ రావడంతోనే ఆగిపోయారా?
హైదరాబాద్: పొడుస్తున్న పొత్తు మీద.. ఎన్నికల వేళ దగ్గర పడుతోంది. మహాకూటమి సీట్ల సర్దుబాటుపై కుస్తీ పడుతున్నారు. మరోవైపు ఆకస్మాత్తుగా ప్రజా గాయకుడు గద్దర్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ దగ్గర ప్రత్యక్ష్యమయ్యారు. కానీ.. కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు.
తాను ఏ పార్టీకీ చెందిన వాడిని కాదని గద్దర్ ప్రకటించారు. ఢిల్లీ గడప తొక్కిన గద్దర్ కాంగ్రెస్ కండువా ఎందుకు కప్పుకోలేదనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తన తనయుడి రాజకీయ భవిష్యత్తు కోసమే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని గద్దర్ కలిసినట్లు ప్రచారం సాగుతోంది. అంతేకాదు అన్ని కలిసి వస్తే మహాకూటమి నుంచి సీఎం అభ్యర్థిగా బరిలో దిగాలని గద్దర్ భావించారని సమాచారం. అయితే మావోయిస్టు సెంట్రల్ కమిటీ నుంచి ఫోన్ కాల్ రావడంతోనే గద్దర్ కాంగ్రెస్లో చేరే నిర్ణయాన్ని విరమించుకున్నారని వామపక్ష పార్టీ ప్రతినిధులు చెప్పుకుంటున్నారు.
ప్రజాగాయకుడిగా గద్దర్ పాటలకు ఎంతో మంది ప్రభావితమయ్యారు. మావోయిస్టులుగా మారి అడవిబాట పట్టిన వారు ఎందరో ఉన్నారు. ఆయన పాట అంత పవర్ఫుల్. ఎమర్జెన్సీతో ప్రజాస్వామ్య భారత్కు మాయని మచ్చ తెచ్చిన కాంగ్రెస్ ఏ విధంగా రాజ్యాంగాన్ని రక్షించగలదో గద్దర్ చెప్పాలని ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అవినీతితో దేశాన్ని అధోగతి పాల్జేసిన కాంగ్రెస్ పార్టీలో తన తనయుడిని చేర్చడంతో పాటు కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తానని గద్దర్ చెప్పుకోవడం విచిత్రమని స్వయంగా ఆయన అభిమానులే విమర్శిస్తున్నారు. గద్దర్ వేస్తున్న ప్రతి తప్పటడుగునూ, ఆయన అభిమానులూ, విమర్శకులు ఓ కంట కనిపెడుతూనే ఉన్నారు.
ప్రశస్తి, జర్నలిస్ట్, హైదరాబాద్
Be the first to comment