తెలుగు రాష్ట్రాల్లో స్వామీ పరిపూర్ణానంద ప్రభావమెంత?

న్యూఢిల్లీ: శ్రీ పీఠం అదిపతి స్వామీ పరిపూర్ణానంద భారతీయ జనతా పార్టీలో చేరారు. ఢిల్లీలో నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో సమావేశమై చర్చలు జరిపారు. అనంతరం ఆయనను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నట్లు షా ప్రకటించారు. ఆ సమయంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ కూడా అక్కడే ఉన్నారు. ఆ తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడిన పరిపూర్ణానంద తాను ఆధ్యాత్మిక మార్గంలో త్రికరణశుద్ధితో పనిచేసినట్లుగానే బీజేపీలో కూడా పనిచేస్తానని చెప్పారు. తాను సాధువునని, 24 గంటలూ పార్టీకి అందుబాటులో ఉంటానని చెప్పారు. దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తోన్న బీజేపీకి అమిత్ షా, నరేంద్ర మోదీ నేతృత్వంలో పనిచేసేందుకు సిద్ధమన్నారు.

మరోవైపు స్వామీ పరిపూర్ణానందను తెలంగాణలో బీజేపీ తరపున సీఎం అభ్యర్ధిగా ప్రకటించే అవకాశాలున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీచేస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రవచనాలతో తెలుగు ప్రజలకు సన్నిహితులైన స్వామీ పరిపూర్ణానంద ఆధ్యాత్మిక అంశాలతో పాటు సామాజిక అంశాలపై కూడా చురుగ్గా స్పందిస్తుంటారు. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ మాదిరిగానే తెలుగు రాష్ట్రాల్లో స్వామి పరిపూర్ణానంద పార్టీ పటిష్టతకు తోడ్పడతారని బీజేపీ అధిష్టానం విశ్వసిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ అధికారంలోకి వచ్చేదిశగా స్వామి తీవ్రంగా యత్నిస్తారని పార్టీ శ్రేణులు నమ్మకంగా ఉన్నాయి.

సినీ విమర్శకుడు కత్తి మహేశ్ శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పడు స్వామీ పరిపూర్ణానంద విరుచుకుపడ్డారు. దీంతో తొలుత కత్తి మహేశ్‌ను హైదరాబాద్ పోలీసులు నగర బహిష్కరణ చేశారు. ఆ తర్వాత కేసీఆర్ సర్కార్ స్వామీ పరిపూర్ణానందను కూడా నగర బహిష్కరణ చేసింది. దీంతో స్వామి హైకోర్టును ఆశ్రయించారు. ఆయనపై నిషేధం తొలిగాక బీజేపీ శ్రేణులు ఆయనకు హైదరాబాద్‌లోకి ఘనంగా స్వాగతం పలికాయి.

కోమటోళ్లు సామాజిక స్మగ్లర్లు అంటూ ప్రొఫెసర్ కంచె ఐలయ్య పుస్తకం రాసినప్పుడు స్వామీ పరిపూర్ణానంద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐలయ్యను నిలదీశారు. వైశ్యుల పక్షాన నిలబడ్డారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వైశ్యులకు స్వామీ పరిపూర్ణానంద దైవంగా మారారు.

స్వాములు రాజకీయాల్లోకి రావడం ఉత్తరాదిలో సాధారణమే కానీ దక్షిణాదిన బహుశా ఇదే ప్రధమం. ఒక పీఠానికి అధిపతిగా ఉంటూ ప్రత్యక్ష రాజకీయాల్లోక ివచ్చిన యువనేత స్వామి పరిపూర్ణానంద ఒక్కరే.

పరిపూర్ణానంద రాకతో తెలుగు రాష్ట్రాల్లో కమల వికాసం ఖాయమని బీజేపీ శ్రేణులు విశ్వసిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వామి నేతృత్వంలో బీజేపీ గణనీయమైన ఫలితాలు సాధించగలదని ధీమాగా ఉన్నాయి. ఆధ్యాత్మికవేత్తగా తెలుగు రాష్ట్రాల్లో స్వామీజికి ఉన్న ఆదరణ రాజకీయంగానూ లభిస్తుందా? ప్రత్యేక హోదాపై ఏపీలో ప్రత్యేక పరిస్థితులు ఏర్పడ్డాయి. నిన్నటిదాకా జట్టుగా ఉన్న టీడీపీ, బీజేపీ నేడు కత్తులు దూసుకుంటున్నాయి. మాటల యుద్ధం కురిపించుకుంటున్నాయి.

2014లో జనసేన కూడా తోడు రాగా మోదీ, చంద్రబాబు, పవన్ కాంబినేషన్‌లో ఎన్డీయే విజృంభించింది. ఏపీలోనే కాదు హస్తినలోనూ అధికారం దక్కించుకుంది. ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. నాడు జట్టుగా ఉన్న టీడీపీ వేరుపడింది. జనసేన వేరు కుంపటి పెట్టింది. ఈ తరుణంలో ఏపీలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితులను బీజేపీకి అనుకూలంగా మార్చడంలో స్వామి తోడ్పడతారని బీజేపీ అధిష్టానం విశ్వసిస్తోంది. ప్రజలతో ఉన్న సంబంధాలతో పాటు మంచి కమ్యూనికేటర్‌గా పేరున్న స్వామి పరిపూర్ణానంద కేంద్రం చేసిన సాయాన్ని, చేయబోతున్న సాయం గురించి చెప్పి ప్రజలను జాగృతం చేయగలరని కమల దళం నమ్మకంగా ఉంది.

స్వామి పరిపూర్ణానందకు డిసెంబర్ ఏడున అసలు పరీక్ష ఎదురుకానుంది. స్వామి ఏమేరకు ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లారు. ఏ మేరకు విజయం సాధించగలిగారనేది డిసెంబర్ 11న తేలిపోనుంది. డిసెంబర్ ఏడున తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. 11న ఫలితాలు వెలువడతాయి. దీంతో ఉన్న ఈ 50 రోజుల్లో బీజేపీని ప్రజలకు మరింత సన్నిహితం చేసేందుకు, అలాగే ప్రత్యర్ధులను మట్టికరిపించేందుకు స్వామి ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తారనేది ఆసక్తికరంగా మారనుంది. మోదీ, షా, పరిపూర్ణానంద కాంబినేషన్‌పై బీజేపీ శ్రేణుల అంచనాలు ఏమేరకు సఫలీకృతమౌతాయనేది డిసెంబర్ 11న తేలిపోతుంది.

కొత్తూరు విజయ్‌, జర్నలిస్ట్, గుడివాడ.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*