ప్రత్యర్ధులకు షాకిచ్చిన పవన్.. లక్నోలో ప్రత్యక్షమైన జనసేనాని!

లక్నో: బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతిని కలిసేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యూపీ రాజధాని లక్నో చేరుకున్నారు. ఏపీలో బీఎస్పీతో పొత్తులు కుదుర్చుకునేందుకే పవన్ లక్నో చేరుకున్నట్లు తెలుస్తోంది. పవన్ తన వెంట విద్యావేత్తలు, ఓయూ విద్యార్ధులను తీసుకెళ్లారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మాయావతితో భేటీ కుదరకపోతే బీఎస్పీ సీనియర్ నేతలతో పవన్ సమావేశమౌతారు.

ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద సంఖ్యలో ఉన్న దళిత ఓటు బ్యాంకును జనసేనవైపు తిప్పుకునే లక్ష్యంగా పవన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. దళితుల ఓట్లు జనసేనతో కలిస్తే తమదే అధికారం అని జనసేన వర్గాలు విశ్వాసంగా ఉన్నాయి. ఇప్పటికే పవన్ రాష్ట్రమంతటా విస్తృతంగా పర్యటిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తీవ్రంగా విమర్శిస్తున్నారు. దీంతో టీడీపీ, వైసీపీతో పాటు జనసేన కూడా 2019లో గట్టిపోటీ ఇవ్వనుందనే సంకేతాల్ని ప్రజల్లోకి పంపుతున్నారు.

మాయాతో భేటీ తర్వాత పవన్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. పవన్ చర్యతో రాజకీయ ప్రత్యర్ధులు షాక్ అయ్యారు. మాయాతో పొత్తు కుదుర్చుకోవాలనుకున్న ఆలోచన మిగతా పార్టీలకు వచ్చేలోగానే ఒక ఒప్పందానికి రావడం పవన్ వేసిన వ్యూహాత్మక ఎత్తుగడ అని జనసేన వర్గాలు చెబుతున్నాయి.

2019 అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలకు కూడా జనసేన-బీఎస్పీ పొత్తు ఉండే అవకాశం ఉంది. జనసేనకు ఇప్పటికే వామపక్షాలతో పొత్తు ఉంది. బీఎస్పీ కూడా కలిస్తే బలం మరింత పెరుగుతుందని జనసేన విశ్వాసంగా ఉంది.

వైసీపీ, టీడీపీ మధ్య గట్టిపోటీ నెలకొన్న తరుణంలో జనసేనకు ఓటు బ్యాంక్ పెంచే పవన్ వ్యూహాత్మక అడుగులు ఏ పార్టీని దారుణంగా దెబ్బతీస్తాయనేది ఆసక్తికరంగా మారుతోంది. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొంత కాలం ఆగాల్సిందేనని రాజకీయ పరిశీలకులంటున్నారు.

కొత్తూరు విజయ్, జర్నలిస్ట్, గుడివాడ

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*