సీబీఐ డైరక్టర్‌గా తెలుగు అధికారి.. ఆకస్మిక నిర్ణయం వెనుక ఏం జరిగిందంటే!

న్యూఢిల్లీ: క్రైం బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నూతన డైరెక్టర్‌గా మన్నెం నాగేశ్వరరావును నియమిస్తూ మోదీ సర్కారు నిర్ణయం తీసుకుంది. సీబీఐలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సలహా మేరకు ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒడిశా కేడర్‌కు చెందిన మన్నెం నాగేశ్వరరావు తెలుగువారు. 1986 ఐపీఎస్ బ్యాచ్‌ అధికారి. వరంగల్ జిల్లా మంగపేట మండలం బోర్ నర్సాపూర్ ఈయన స్వస్థలం. ఏడాదిన్నరగా ఆయన సీబీఐలో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

సీబీఐలో కొద్దిరోజులుగా నెలకొన్న పరిణామాలు ఆ సంస్థకు మచ్చ తెచ్చేలా మారాయి. దీంతో మోదీ సర్కారు సీబీఐ ప్రక్షాళనకు నడుం బిగించింది. డైరక్టర్ అలోక్ వర్మ, నెంబర్ టూ స్థానంలో ఉన్న రాకేష్ ఆస్థానా పరస్పరం గొడవపడటమే కాక అవినీతి ఆరోపణలు చేసుకున్నారు. మాంసం వ్యాపారి ఖురేషీ మనుషుల నుంచి లంచం తీసుకున్నారనే ఆరోపణలు సీబీఐ పరువును బజారుకీడ్చాయి. రాకేష్ ఆస్థానాపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. రాకేశ్ ఆస్థానా ఏకంగా డైరక్టర్ అలోక్ వర్మపై అవినీతి ఆరోపణలు చేయడం, లాలూ కేసులో చూసీచూడనట్లు ఉండాలని తనను ఆదేశించారంటూ అలోక్‌పై రాకేశ్ చెప్పడంతో కేంద్ర ప్రభుత్వం కన్నెర్ర చేసింది.

మోదీ సర్కారు ఆగ్రహానికి మరో కారణం కూడా ఉంది. అవినీతికి తావు లేకుండా నాలుగున్నరేళ్లు నెట్టుకొచ్చిన ఎన్డీయే సర్కారుకు సీబీఐలో పరిణామాలు కళంకం తెచ్చేలా తయారయ్యాయి. దీనికి తోడు రఫెల్ ఒప్పందంపై విచారణ జరిపించాలంటూ సీనియర్ జర్నలిస్ట్ అరుణ్ శౌరి, మాజీ బీజేపీ నేత యశ్వంత్ సిన్హా వినతిపత్రం సమర్పించేందుకు వస్తే అలోక్ వర్మ స్వయంగా స్వీకరించారు. దీంతో రఫెల్ ఒప్పందంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు బలం ఏర్పడింది. అలోక్ వర్మ నిర్ణయంతో మోదీ సర్కారు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒక రకంగా అలోక్ వర్మ మోదీ సర్కారును బ్లాక్‌మెయిల్ చేశారని కూడా వార్తలు వచ్చాయి. దీంతో సీవీసీ సలహా మేరకు కేంద్రం మన్నెం నాగేశ్వరరావును కొత్త డైరక్టర్‌గా నియమించింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*