బ్రేకింగ్ న్యూస్: ఏపీ పోలీసులకు స్టేట్‌మెంట్ ఇవ్వడానికి జగన్ నిరాకరణ

హైదరాబాద్: వైజాగ్ ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో తనపై జరిగిన దాడి ఘటనపై ఏపీ పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నిరాకరించారు. ఏసీపీ నాగేశ్వరరావు సారధ్యంలో పోలీసులు  సిటీ న్యూరో సెంటర్‌కు వచ్చి స్టేట్‌మెంట్ ఇవ్వాలని కోరారు. అయితే ఇందుకు జగన్ నిరాకరించారు.  ఏపీ పోలీసులపై తనకు నమ్మకం లేదని జగన్ స్పష్టం చేశారు. దేశంలో వేరే ఏ పోలీసులు వచ్చినా తాను స్టేట్‌మెంట్ ఇస్తానని చెప్పారు. దీంతో చేసేదేమీ లేక ఏపీ పోలీసులు వెనుదిరిగారు.

అంతకు ముందు ఏపీ పోలీసులు జగన్‌కు అందిస్తున్న వైద్యం గురించి కూడా పోలీసులు వైద్యుల నుంచి వివరాలు సేకరించారు.

మరోవైపు జగన్‌పై శ్రీనివాస్ దాడికి పాల్పడటానికి వెనుక ఉన్న కుట్రను వెల్లడించాలని వైసీపీ కోరుతోంది. దాడిపై సీబీఐ విచారణ జరిపించాలని వైసీపీ కోరింది. సీబీఐ విచారణ ద్వారానే అన్ని విషయాలూ వెలుగులోకి వస్తాయని వైసీపీ విశ్వాసంగా ఉంది.

నిన్న మధ్యాహ్నం పన్నెండున్నర సమయంలో విశాఖ ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో జగన్‌పై వెయిటర్ శ్రీనివాస్ కోడిపందాల కత్తితో దాడి చేసి గాయపరిచాడు. వెంటనే అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రాధమిక చికిత్స అనంతరం జగన్ హైదరాబాద్ వచ్చి సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చేరారు.

మరోవైపు దాడి దృష్ట్యా జగన్ నేడు సీబీఐ కోర్టుకు హాజరుకాలేకపోయారు. జగన్ తరపు న్యాయవాదుల వినతి మేరకు కోర్టు ఆయనకు నేడు మినహాయింపు ఇచ్చింది.

అటు జగన్‌పై దాడి ఘటనను సీఎం చంద్రబాబు సహా రాజకీయ పార్టీల నేతలంతా ఖండించారు.

అటు జగన్‌పై దాడి జరిగిన ప్రదేశం కేంద్ర పరిధిలో ఉందని, దాడి జరిగాక జగన్ నేరుగా హైదరాబాద్ వెళ్లిపోయారని చంద్రబాబు చెప్పారు. ప్రతిపక్ష నాయకుడు పోలీసులకు సమాచారం అందించాల్సి ఉందా లేదా? అని ప్రశ్నించారు. సీఐఎస్ఎఫ్ అధికారులు ఆలస్యంగా సమాచారం ఇవ్వడం, దాడికి ఉపయోగించిన ఆయుధాన్ని తమ దగ్గరే ఎందుకు ఉంచుకోవాల్సి వచ్చిందో ప్రజలకే చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

సంఘటన జరిగిన వెంటనే గవర్నర్ నేరుగా డీజీపీకి ఫోన్ చేసి రిపోర్టు అడిగడాన్ని సీఎం చంద్రబాబు తప్పుబట్టారు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*