తనను తక్కువగా అంచనా వేయవద్దన్న చంద్రబాబు అన్నంత పనీ చేస్తారా?

న్యూఢిల్లీ: హస్తిన పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీబిజీగా ఉన్నారు. ఢిల్లీకి చేరుకోగానే ఆయన ఏపీ భవన్‌లో తొలుత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు. ఆ సమయంలో లోక్‌తాంత్రిక్ జనతాదళ్ నేత శరద్ యాదవ్ కూడా అక్కడే ఉన్నారు. చంద్రబాబు కేజ్రీవాల్‌కు తిరుమల వెంకన్న ఫొటోను కేజ్రీవాల్‌కు బహుకరించారు. అనంతరం ముగ్గురు నేతలూ తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.

ఢిల్లీ పర్యటనకు ముందు తనను తక్కువగా అంచనావేయవద్దని, శనివారం నుంచి తానేంటో అంతా చూస్తారని చంద్రబాబు హెచ్చరించారు. గవర్నర్ వ్యవస్థను కేంద్రం బ్రష్టుపట్టిస్తోందని చంద్రబాబు మండిపడ్తున్నారు. తాజా పర్యటనలో ఆయన టార్గెట్ గవర్నర్ వ్యవస్థే అని తెలుస్తోంది. మరికాసేపట్లో చంద్రబాబు జాతీయ మీడియాతో మాట్లాడనున్నారు.

విశాఖ ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై వెయిటర్ శ్రీనివాస్ కోడికత్తితో దాడి చేయడంపై గవర్నర్ నరసింహన్ ఏపీ డీజీపీతో మాట్లాడారు. నివేదిక ఇవ్వాలని కోరారు. దీనిపై చంద్రబాబు మండిపడ్డారు. తన అధికారులతో గవర్నర్ ఎలా మాట్లాడతారని చంద్రబాబు ప్రశ్నించారు. ఏమైనా వివరాలు కావాలంటే తనను అడగాలని, అంతేకాని తన అధికారులకు గవర్నర్ నేరుగా ఎలా ఫోన్ చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. గవర్నర్ కేంద్రానికి అనుకూలంగా వ్యవహరిస్తూ, ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నివేదికలు పంపుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. దీనికి తోడు ఐటీ దాడులపై కూడా బాబు గుర్రుగా ఉన్నారు.

నిన్న అందుబాటులో ఉన్న ఏపీ మంత్రులతో సమావేశమైన చంద్రబాబు శనివారం నుంచి తన తడాఖా చూపిస్తానని చెప్పినట్లు తెలిసింది. తానంటే ఏంటో శనివారం నుంచి అందరూ చూస్తారని కూడా చంద్రబాబు హెచ్చరించారు. తనను తక్కువగా అంచనావేయవద్దన్నారు. అన్నట్లుగానే చంద్రబాబు మోదీ వ్యతిరేకులను ఏకతాటిపైకి తెస్తున్నారు.

ఇప్పటికే రాహుల్ గాంధీతో సానుకూల సంబంధాలు నెరుపుతున్న చంద్రబాబు తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు కూడా పెట్టుకున్నారు. మోదీకి అనుకూలుడైన కేసీఆర్‌కు వ్యతిరేకంగా తాము పనిచేస్తామని చంద్రబాబు చెప్పకనే చెప్పారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేతృత్వంలో మోదీ వ్యతిరేకులను ఏకతాటిపైకి తెచ్చేందుకు చంద్రబాబు చురుగ్గా పావులు కదుపుతున్నారు. తద్వారా 2019 లోక్‌సభ ఎన్నికల నాటికి మోదీకి వ్యతిరేకంగా బలమైన కూటమిని ఏర్పాటు చేయాలనేది చంద్రబాబు ప్లాన్‌లా ఉంది.

2019 ఎన్నికల్లో మోదీ ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. మోదీ వ్యతిరేక కూటమికి నాయకత్వం వహించాలని చంద్రబాబు తలపోస్తున్నారు. ఈ కూటమిలోకి మాయావతిని, మమతా బెనర్జీని, నవీన్ పట్నాయక్‌ను, స్టాలిన్, కుమారస్వామి తదితరులను తీసుకువచ్చే కార్యక్రమానికి చంద్రబాబు నాంది పలికినట్లు తెలుస్తోంది. 2019లో కేంద్రంలో యూపిఏ 3 సర్కారును ఏర్పాటు చేయాలనే సంకల్పంతో చంద్రబాబు ముందుకు వెళ్తున్నట్లు టీడీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే జాతీయ రాజకీయాల్లో అనేకసార్లు చక్రం తిప్పిన తమ నేత అనుకున్నట్లుగానే మరోసారి జాతీయ స్థాయిలో మరోమారు విజృంభించడం ఖాయమని టీడీపీ వర్గాలు విశ్వాసంగా ఉన్నాయి.

చంద్రబాబుతో రానున్న ప్రమాదాన్ని ముందే ఊహించిందో ఏమో బీజేపీ ఆరు నెలల ముందే ఎన్డీయే పక్షాలతో సీట్ల సర్దుబాటుపై ఇప్పుడే క్లారిటీకి వచ్చేస్తోంది. బీహార్‌లో చెరి సగం సీట్లలో పోటీ చేయాలని బీజేపీ, జెడియూ నిర్ణయించాయి. మిగతా పార్టీల వారికి వారి బలాబలాలను బట్టి సీట్లు కేటాయిస్తారు. మిగతా రాష్ట్రాల్లోనూ 2019 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఓ పక్క ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తలమునకలైనా ఆయా రాష్ట్రాల్లో ఎన్డీయే పక్షాల నేతలతో సంప్రదింపులు జరుపుతోంది. మహారాష్ట్రలో కూడా బీజేపీ-శివసేనల మధ్య సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*