
తాను ఇంకెంతకాలం బతుకుతానో తెలియదంటూ కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కంటతడి పెట్టుకున్నారు. మాండ్యా లోక్సభ ఉపఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆయన తీవ్ర భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకోవడం అందరి హృదయాలను కదిలించింది. గతంలోనూ పలుమార్లు భావోద్వేగానికి గురైన ఆయన తాజాగా మళపల్లిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు.
గతంలో ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడే చనిపోయి ఉండాల్సిందని పేర్కొన్న కుమారస్వామి దేవుడి దయవల్లే బతికి బట్టకట్టగలిగానని పేర్కొన్నారు. ఇప్పటికైతే బతికి ఉన్నానని, ఇంకెంతకాలం బతికి ఉంటానో మాత్రం చెప్పలేనంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. బతికి ఉన్నంతకాలం ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. జీవితాంతం పేదలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తన హృదయంలోని బాధను ప్రజలు అర్థం చేసుకోవాలని, అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నానని అన్నారు.
కుమారస్వామి వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. కుమారస్వామి నాటకాలు ఆడుతున్నారని, ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఆయనిలా డ్రామాలు ఆడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడింది. ఆయన నాటకాలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారని, తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించింది.
Be the first to comment