పటేల్ విగ్రహాన్ని నిర్మించడం అంత ఘోర తప్పిదమా?: మోదీ

గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలోని నర్మద జిల్లా కేవడియా గ్రామంలో నర్మద నదీతీరంలో సర్దార్ సరోవర్ ఆనకట్ట వద్ద ఉక్కు మనిషి, స్వతంత్ర భారత రూపశిల్పి సర్దార్ పటేల్ విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.

పటేల్ 143వ జయంతి సందర్భంగా ఆవిష్కరించిన ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహం ప్రపంచంలోని ఎత్తైనది. 182 మీటర్ల పొడవున్న ఈ విగ్రహాన్ని మోదీ జాతికి అంకితం చేశారు.

అనంతరం ప్రధాని మోదీ ప్రసంగిస్తూ పటేల్ సేవలను కొనియాడారు. పటేల్ కృషి వల్లే 550 సంస్థానాలు నాడు భారత్‌లో విలీనమయ్యాయని, తద్వారా పటేల్ ఐక్య భారతాన్ని నిర్మించారని చెప్పారు.

పటేల్ ఉక్కు సంకల్పానికి, ఉన్నత వ్యక్తిత్వానికి ఈ విగ్రహం ప్రతీక అని చెప్పారు.

 

గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు పటేల్ విగ్రహాన్ని నిర్మించాలని కలలు కన్నానని, ప్రధానిగా నేడు ఆవిష్కరించగలగడం తన అదృష్టమన్నారు

పటేల్ సంస్థానాలను విలీనం చేయకుండా ఉండి ఉంటే గుజరాత్‌లోని సోమ్‌నాథ్ ఆలయాన్ని, హైదరాబాద్‌లోని చార్‌మినార్ సందర్శించాలంటే వీసా తీసుకుని ఉండాల్సి వచ్చేదని మోదీ గుర్తు చేశారు.

భారతదేశ ఐక్యతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉందని, అదే పటేల్ కృషికి నిజమైన నివాళి అవుతుందని మోదీ చెప్పారు.

పటేల్ విగ్రహాన్ని నిర్మించి ఆవిష్కరిస్తే తాను పెద్ద అపరాధం చేసినట్లు కొందరు రాజకీయ నేతలు ఆరోపిస్తున్నారని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రధాని మోదీ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించడం చారిత్రక ఘటన అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ట్వీట్ చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*