827 పోర్న్ సైట్లను నిషేధించిన కేంద్రం.. ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన నెటిజన్లు

సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తూ యువతను చెడు పోకడలవైపు నడిపిస్తున్న పోర్న్ సైట్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. 827 పోర్న్ సైట్లపై నిషేధం విధించింది. యథాలాపంగా వీటిని ఓపెన్ చేస్తున్న యూజర్లు షాక్‌కు గురవుతున్నారు. నెట్ న్యూట్రాలిటీ చట్టం కింద వీటిని నిషేధించినట్టు హెచ్చరిక కనబడుతుండడంతో అవాక్కవుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ట్విట్టర్ వేదికగా యుద్ధమే మొదలుపెట్టారు. ‘హ్యాష్‌ట్యాగ్ పోర్న్‌బ్యాన్’ పేరుతో ట్విట్టర్‌లో దునుమాడుతున్నారు.

పోర్న్‌హబ్‌ను వీక్షిస్తున్న వారిలో ప్రపంచవ్యాప్తంగా భారతీయులది మూడో స్థానం. అమెరికా, ఇంగ్లండ్ దేశాలు తొలి రెండు స్థానాల్లోనూ కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నిషేధించిన 827 పోర్న్ సైట్లలో అతి పెద్ద సైట్లు అయిన ‘పోర్న్ హబ్’, ‘బీహెన్స్ డాట్ నెట్’ వంటివి కూడా ఉన్నాయి. వీటి యాప్‌లు ఓపెన్ కాకపోవడంతో అవాక్కైన వేలాదిమంది యూజర్లు జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ కస్టమర్ కేర్లకు ఫోన్ చేసి ఆరా తీస్తున్నారు. వేలాదిగా వస్తున్న ఈ ఫోన్లకు సమాధానం చెప్పలేక ఆయా టెలికం సంస్థలు ఆపసోపాలు పడుతున్నాయి.

పోర్న్‌సైట్లను నిషేధించడం దారుణమని పేర్కొంటూ బ్యాన్‌కు వ్యతిరేకంగా వేలాదిమంది చేతులు గళమెత్తుతున్నారు. నెట్ న్యూట్రాలిటీకి ఇది పూర్తిగా విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చర్య ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని మండిపడుతున్నారు. చైల్డ్ పోర్నోగ్రఫీ, రేప్ పోర్న్, బాండేజ్, డిసిప్లిన్, శాడిజమ్, మాసోచిమ్ టైప్స్ ఆఫ్ సెక్సువల్ ప్రాక్టీస్(బీడీఎస్ఎం) వంటి వాటిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి పోర్న్‌హబ్, ఎక్స్ వీడియోస్ డాట్‌కామ్ వంటి వాటిపై నిషేధం విధించడం సబబు కాదని వాదిస్తున్నారు.

ప్రభుత్వ నిర్ణయాన్ని పోర్న్‌హబ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ కోరీ ప్రైస్ తప్పుబట్టారు. ప్రమాదకరమైన సైట్లను వదిలేసి ప్రభుత్వం తమపై పడడం దారుణమన్నారు. నెట్‌లో ప్రమాదకరమైన సైట్లు, అడల్ట్ కంటెంట్ కలిగిన సైట్లు వేలాదిగా ఉన్నాయని, వాటిని ముట్టుకోని ప్రభుత్వం తమ సైట్లను నిషేధించడం సరికాదన్నారు. పోర్నోగ్రఫీ పైనా, అడల్ట్ కంటెంట్‌ను వ్యక్తిగతంగా వీక్షించడంపైనా భారత్‌లో ఎటువంటి చట్టం లేదని పేర్కొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*