వైఎస్ కలను చంద్రబాబు సాకారం చేస్తారా?

న్యూఢిల్లీ: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాకారం చేసేందుకు కంకణం కట్టుకున్నారు. రాహుల్‌ను ప్రధానిగా చూడటమే తన జీవిత కల అని వైఎస్ జీవించి ఉన్న సమయంలో అనేకమార్లు చెప్పారు. అయితే తన కల నెరవేరకుండానే వైఎస్ దురదృష్టవశాత్తూ హెలికాఫ్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆయన కల కలగానే మిగిలిపోయింది. కాంగ్రెస్ పార్టీ పుణ్యాన రాష్ట్రం రెండు ముక్కలయ్యాక ఏపీ సీఎం అయిన చంద్రబాబు వైఎస్ కలను నెరవేర్చేందుకు నడుం బిగించారు. రాహుల్‌ను ప్రధానిగా చూసేవరకూ నిద్రించేది లేదంటూ బీజేపీ వ్యతిరేక కూటమినంతా ఏకతాటిపైకి తెచ్చే పనిలో పడ్డారు. మరోసారి ఎన్డీయే కేంద్రంలో అధికారంలోకి రాకుండా చేసి, మోదీ స్థానంలో రాహుల్‌ను ప్రధానిని చేయాలనుకుంటున్నారు.

ఇందులో భాగంగా చంద్రబాబు న్యూఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారు. అనేక మంది జాతీయ నాయకులను కలుసుకుంటున్నారు. ఇప్పటికే శరద్ పవార్, శరద్ యాదవ్, మాయావతి, ఫరూఖ్ అబ్దుల్లా వంటి సీనియర్ నేతలను కలుసుకుని మంతనాలు జరిపారు.

మమతా బెనర్జీని, నవీన్ పట్నాయక్‌ను, అఖిలేష్, ములాయం, లాలూ తదితర ఎన్డీయేతర పార్టీల నేతలను ఆయన కలుసుకోనున్నారు. 2019లో ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి కాంగ్రెస్‌తో కలిసి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చంద్రబాబు తలపోస్తున్నారు. జాతీయ స్థాయి వామపక్ష నేతలైన సీతారాం ఏచూరి, సురవరం సుధాకర్ రెడ్డి, ప్రకాశ్ కారత్, రాఘవులు వంటి నాయకులతో చంద్రబాబు మంతనాలు జరపనున్నారు.

దక్షిణాది రాష్ట్రాల్లో డీఎంకే అధినేత స్టాలిన్‌తో చంద్రబాబుకు సఖ్యత ఉంది. డీఎంకే కూడా యూపిఏలో భాగస్వామిగా ఉంది. అలాగే కర్ణాటకలో జనతాదళ్ సెక్యులర్-కాంగ్రెస్‌తో కలిసి అధికారంలో ఉంది. ఒకప్పుడు దేవెగౌడను ప్రధానిగా చేసింది తానేనని చంద్రబాబు అనేకసార్లు చెప్పుకున్నారు కూడా. కేరళలో ఎలాగూ వామపక్ష ప్రభుత్వమే ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క కేసీఆర్‌తో తప్ప దాదాపు అన్ని రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల అధినాయత్వంతో చంద్రబాబు మంతనాలు జరుపుతున్నారు. 2019లో మోదీని మరోసారి ప్రధాని కాకుండా అడ్డుకునేందుకు చంద్రబాబు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. రాహుల్‌ను ప్రధానిగా చూడాలనే లక్ష్యంతో దూకుడుగా పనిచేస్తున్నారు.

తన లక్ష్య సాధనలో తొలుతగా తనకూ, కాంగ్రెస్‌కు ప్రత్యర్ధి అయిన కేసీఆర్‌ను తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించేందుకు చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేశారు. నేరుగా రాహుల్‌తో సమావేశమై తెలంగాణలో తమకు సత్తా ఉందని చెబుతూ మహాకూటమి పొత్తుల్లో భాగంగా 14 స్థానాల్లో టీడీపీకి సీట్లు దక్కించుకున్నారు. తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రుల ఓట్లకు గాలం వేసేందుకు యత్నిస్తున్నారు. కేసీఆర్‌ను ఓడిస్తే మోదీని ఓడించినట్లేనంటూ ఇప్పటికే తెలంగాణ టీడీపీ నేతలు ప్రచారం మొదలు పెట్టారు.

నిజానికి టీడీపీ శ్రేణులు మాత్రం చంద్రబాబే కాబోయే ప్రధాని అంటూ ప్రచారం చేస్తున్నాయి. అయితే జాతీయ స్థాయిలో చంద్రబాబు చక్రం తిప్పేది తన కోసం కాదని, రాహుల్‌ను ప్రధానిని చేసేందుకేనని చంద్రబాబు చెప్పకనే చెబుతున్నారు. ఎలాగంటే తాను ప్రధాని కావాలనుకోవడం లేదని చంద్రబాబు గతంలో అనేకసార్లు స్పష్టం చేశారు. తానే ప్రధాని అభ్యర్ధులను ఎంపిక చేశానని చంద్రబాబు అనేకసార్లు చెప్పుకున్నారు. ఇప్పుడు కూడా తనకు జాతీయ రాజకీయాలు వద్దని, తనకు తెలుగు ప్రజల శ్రేయస్సు మాత్రమే చాలని, తాను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని చంద్రబాబు ఇటీవల కూడా చెప్పారు. దీన్ని బట్టి ఎన్డీయేతర పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే లక్ష్యం తన కోసం కాదని, రాహుల్‌ను ప్రధానిని చేసేందుకేనని చంద్రబాబు చెప్పకనే చెబుతున్నారు.

మారిన సమీకరణాల నేపథ్యంలో చంద్రబాబుకు న్యూఢిల్లీలో ఏఐసీసీ ఇస్తున్న ప్రియారిటీ అంతా ఇంతా కాదు. యూపిఏ చైర్ పర్సన్ సోనియా కానీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ కానీ, ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలు కానీ చంద్రబాబును గతంలో లేనంతగా చాలా గౌరవంగా చూసుకుంటున్నారు. తెలంగాణాలో చంద్రబాబు కోరినన్ని సీట్లను కాంగ్రెస్ పార్టీ ఇచ్చేసింది.

ఎన్డీయేతో వ్యవహారం చెడి బీజేపీకి దూరమైన చంద్రబాబు ఇటీవలి పరిణామాలతో మోదీపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అందుకే కాంగ్రెస్‌కు దగ్గరౌతున్నారు. ఈ క్రమంలో పటిష్టంగా ఉన్న ఎన్డీయేను…. బలహీనంగా ఉన్న కాంగ్రెస్‌ను, ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా మోదీకి చెక్ పెట్టడం సాధ్యం కావొచ్చనేది చంద్రబాబు వ్యూహం.

చివరగా రాహుల్‌ను ప్రధానిగా చూడాలనుకున్న వైఎస్ కలను సాకారం చేసే బాధ్యతను భుజాలపైకెత్తుకున్న చంద్రబాబు లక్ష్యం నెరవేరుతుందో లేదో చూడాలంటే 2019 మే నెల దాకా ఆగక తప్పదు మరి.

విహారి, జర్నలిస్ట్, హైదరాబాద్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*