దూసుకుపోతున్న పరిపూర్ణానంద.. తెలంగాణాలో మారుతున్న సమీకరణాలు

హైదరాబాద్: ఎన్నికల వేళ బీజేపీకి నాయకుడు దొరికాడు. తెలంగాణా ప్రజల్లో తమకున్న ఆదరణను ఓట్ల రూపంలోకి మార్చుకునేందుకు సరైన నాయకుడు లేక ఇబ్బంది పడుతున్న బీజేపీని ఆదుకునేందుకు లీడర్ వచ్చేశాడు. ఆయన సభలకు జనం పోటెత్తుతున్నారు. మోదీ, షా సభల తరహాలో స్వామీ పరిపూర్ణానంద నిర్వహించే సభలకు జనం తరలివస్తున్నారు.

సంస్కృత భాషలో ఉండే వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత సారాంశాన్ని అలవోకగా అర్ధమయ్యేలా సామాన్య జనానికి చెప్పి ఆకట్టుకున్నట్లే ప్రజా సమస్యలను కూడా ఆయన సులభంగా ఏకరువు పెడుతున్నారు. ప్రభుత్వ తప్పిదాలను ఎండగడ్తున్నారు. వరంగల్‌ సాయిబాబా దేవాలయ పూజారి సత్యనారాయణపై ఎల్‌బినగర్ మసీదు ఇమామ్ సయ్యద్ సాధిక్ హుస్సేన్ చేసిన దాడిపై స్వామి పరిపూర్ణానంద ప్రభుత్వాన్ని నిలదీశారు. సత్యనారాయణ అంత్యక్రియలకు హాజరైన ఆయన హిందువులు పూజలు చేసుకోకూడదా అని ప్రశ్నించారు. ఎన్నికల సభల్లోనూ పూజారి సత్యనారాయణపై దాడి అంశాన్ని స్వామీ పరిపూర్ణానంద ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు.

రాజకీయ నేతల్లో ఉండే బంధుప్రీతిని స్వామీజీ దుయ్యబడుతున్నారు. ప్రజాస్వామ్యంలో వారసత్వ రాజకీయాలు తగవని, కుటుంబపాలన అంతమొందించాలని కామారెడ్డి, నల్గొండ బహిరంగ సభల్లో పిలుపిచ్చారు. కేంద్రం అందిస్తున్న సాయం గురించి, కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రచారం చేస్తున్నారు. అవినీతి అంతమవ్వాలంటే భారతీయ జనతాపార్టీకి పట్టం కట్టాలని స్వామీజీ ప్రజలను కోరుతున్నారు.

సభలకు అనూహ్య స్పందన వస్తుండటంతో ఇప్పుడు అభ్యర్ధులంతా వారి వారి నియోజకవర్గాల్లో పర్యటించాలని స్వామీజీకి విజ్ఞప్తి చేస్తున్నారు. వాడుక భాషలో సూటిగా విషయాలను చెబుతూ ప్రజలను తట్టి లేపుతున్న స్వామీజీ అధిష్టానం తనపై ఉంచిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తున్నారు.

తెలుగుతో పాటు మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ప్రావీణ్యం ఉండటంతో దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాలతో పాటు ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించే బాధ్యతను కూడా అధిష్టానం అప్పగించనుంది.

స్వామీజీ ప్రచారం మొదలు పెట్టకముందు బీజేపీని చాలామంది సీరియస్‌గా తీసుకోలేదు. ఎప్పుడైతే ఆయన ప్రజలకు జనం బ్రహ్మరథం పడుతున్నారో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. మిగతా పార్టీల గెలుపోటములను కూడా శాసించే దిశగా బీజేపీ అవతరించింది. దీంతో అందరి దృష్టీ స్వామీజీ ప్రచారంపై పడింది.

స్వామీజీ తన వాగ్ధాటితో పార్టీని ప్రజలకు మరింత చేరువ చేస్తున్నారని బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ మెరుగైన ఫలితాలు సాధిస్తామని కార్యకర్తలు, నేతలు విశ్వాసంగా చెబుతున్నారు.కనీసం 70 స్థానాల్లో గెలవాలనే లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా స్వామీజీ దూసుకుపోతున్నారు.

కొత్తూరు విజయ్, జర్నలిస్ట్, హైదరాబాద్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*