కొత్త కూటమి పీఎం అభ్యర్ధి చంద్రబాబు?

హైదరాబాద్: బీజేపీ, ఎన్డీయేతర పార్టీలకు వ్యతిరేకంగా కొత్త కూటమి ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన ఏపీ సీఎం చంద్రబాబు తన లక్ష్యం సాధించే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. చెన్నైలో డీఎంకే అధినేత స్టాలిన్‌ను కలుసుకున్నారు. స్టాలిన్‌తో పాటు కనిమొళిని, రాజాను, ఇతర డీఎంకే నేతలనూ కలుసుకున్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. భవిష్యత్ వ్యూహంపై, రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై లోతుగా చర్చించారు.

కరుణ మరణించిన సమయంలోనూ చంద్రబాబు స్వయంగా చెన్నై వెళ్లి స్టాలిన్‌ను పరామర్శించారు.

ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు తన తడాఖా చూపిస్తానంటూ కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తు కూడా కుదుర్చుకున్నారు. ప్రాంతీయ పార్టీలను ఒక తాటిపైకి తీసుకొచ్చేందుకు చంద్రబాబు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. కొత్త కూటమి ప్రాధాన్యతను, ఆవశ్యకతను ఆయా పార్టీల అధినేతలతో చర్చిస్తున్నారు. కొత్త కూటమిలో కాంగ్రెస్‌ చేరుతుందా లేదా అనేది ఇంకా తేలనప్పటికీ కాంగ్రెస్ సహకారంతో కేంద్రంలోని మోదీ సర్కారుకు చెక్ పెట్టాలని చంద్రబాబు యోచిస్తున్నారు. కాంగ్రెస్ కూడా రాహుల్ ప్రధాని కాకున్నా పర్వాలేదు మోదీ ప్రధాని కావొద్దనే వ్యూహంతో పావులు కదుపుతోంది. సరిగ్గా ఈ అంశంపైనే చంద్రబాబు, రాహుల్ ఒక్కటయ్యారు.

తన వ్యూహంలో భాగంగా చంద్రబాబు బెంగళూరు వెళ్లారు. ఇటీవలి ఉప ఎన్నికల్లో విజయం సాధించినందుకు జేడీఎస్ అధినేత దేవెగౌడకు, కర్ణాటక సీఎం కుమారస్వామికి కంగ్రాట్స్ చెప్పారు. తాను ఏర్పాటు చేయబోయే కూటమికి సహకారం కావాలని చంద్రబాబు దేవెగౌడను కోరారు. అన్నింటినీ మించి దేవెగౌడ ఆశీస్సుల కోసం తాను వచ్చానని చెప్పడం ద్వారా చంద్రబాబు మనసులో మాట చెప్పకనే చెప్పారు.

దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు బీజేపీ వ్యతిరేక పక్షాలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నానంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

 

జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేస్తూ నేడు మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక సీఎం కుమారస్వామిని కలిసి చర్చించామని చంద్రబాటు ట్విటర్ ద్వారా తెలిపారు.

 

దేశాన్ని మోదీ రాక్షస పాలన నుండి కాపాడేందుకు రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి నడవాలని నిర్ణయించామంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

 

కొత్త కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారనేది ఇప్పటికే తేలిపోయింది. కూటమి ఏర్పాటుకు అన్నీ తానై ముందుకెళ్తున్న చంద్రబాబు నాయుడే 2019 కూటమి ప్రధాని అభ్యర్ధి అని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అయితే ఏపీలో టీడీపీకి ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయనే విషయంపై కూడా ఇది ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మమతా బెనర్జీ, మాయావతి, ములాయం, నవీన్ పట్నాయక్ వంటి బలమైన ప్రాంతీయ పార్టీల నేతలు ఎక్కువ ఎంపీ సీట్లు తెచ్చుకోని చంద్రబాబుకు కాంపిటీటర్లుగా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే దక్షిణాది రాష్ట్రాల తరపున తానే పీఎం అభ్యర్ధి అని ప్రొజెక్ట్ అయితే మిగతా బలమైన ప్రాంతీయ పార్టీలు కూడా వెనక్కు తగ్గాల్సిందేనని చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకే దక్షిణాది రాష్ట్రాల సీఎంలతో, ఆయా పార్టీల అధినాయకత్వంతో చంద్రబాబు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. దక్షిణాది నుంచి తాను బలమైన నేతనని చంద్రబాబు కూటమి ద్వారా నిరూపించుకునే యత్నం చేస్తున్నారు. చంద్రబాబుకు పవార్, ఫరూఖ్ అబ్దుల్లా, లాలూ యాదవ్, శరద్ యాదవ్, అజిత్ సింగ్ వంటి ఉత్తరాది నేతల మద్దతు కూడా ఉంది.

2019లో బీజేపీకి మెజార్టీ తగ్గితే చంద్రబాబు మరోసారి చక్రం తిప్పడం ఖాయమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. 2019లో మోదీ వర్సెస్ చంద్రబాబు అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు కొత్త కూటమితో అప్రమత్తమైన బీజేపీ తన వ్యూహాలకు పదునుపెట్టింది. ఉత్తరాదిలో మెజార్టీ సీట్లు సాధించేందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది. అయోధ్యలో రామ మందిరం నిర్మాణంపై ఆర్డినెన్స్ తేవడం ద్వారా యూపీతో పాటు ఉత్తరాదిలో మరోసారి మెజార్టీ సీట్లు తెచ్చుకునేందుకు కమలనాథులు వ్యూహరచన చేస్తున్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికలపై మరింత స్పష్టత రావాలంటే మరికొంత కాలం ఆగక తప్పదని పరిశీలకులు చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*