నందమూరి సుహాసిని పోటీపై తారక్ స్పందన

హైదరాబాద్: కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి మహాకూటమి తరపున టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన నందమూరి సుహాసినిపై ఆమె సోదరుడు తారక్ తొలిసారిగా స్పందించారు. స్త్రీలు సమాజంలో ఉన్నతమైన పాత్రను పోషించాలని తమ కుటుంబం నమ్ముతుందని, అదే స్ఫూర్తితో ఎన్నికల బరిలోకి దిగిన తమ సోదరి నందమూరి సుహాసినిని విజయం వరించాలని తారక్ ఆకాంక్షించారు.

ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అనే సిద్ధాంతంతో తన తాత నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ తమకు ఎంతో పవిత్రమైందంటూ తారక్ ట్వీట్ చేశారు. తన తండ్రి నందమూరి హరికృష్ణ సేవలందించిన కూకట్‌పల్లి నుంచి సుహాసిని పోటీ చేస్తున్న విషయాన్ని తారక్ తన అభిమానులకు సూచించారు.

చివర్లో తాతకు, తండ్రికి జోహార్లు అర్పించారు. ట్వీట్‌కు జత చేసిన ప్రకటనలో తారక్‌తో పాటు తన సోదరుడు కళ్యాణ్‌రామ్ పేరు కూడా పెట్టారు. ప్రకటన ఇద్దరు సోదరులూ కలిసి విడుదల చేశారు.

తన సోదరులిద్దరికీ సుహాసిని వెంటనే ట్విటర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. తనకు మద్దతు ప్రకటించినందుకు ధన్యవాదాలు చెప్పారు.

కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి ఆమె టీడీపీ తరపున నామినేషన్ వేశారు.

కూకట్‌పల్లి నుంచి మహాకూటమి తరపున నందమూరి సుహాసిని పోటీ చేస్తుండగా అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి మాధవరం కృష్ణారావు(2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు). బీజేపీ నుంచి కాంతారావు బరిలో ఉన్నారు. ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. ఏపీ నుంచి వచ్చి స్థిరపడిన వారు ఎక్కువగా ఉండే కూకట్‌పల్లి నియోజకవర్గంలో తాజా పోటీ ఆసక్తిరేపుతోంది. నందమూరి హరికృష్ణ మరణంతో ఓటర్లలో ఉన్న సానుభూతి ఓటుగా మారుతుందా అనేది చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*