
హైదరాబాద్: బిఎన్ రెడ్డి నగర్లో దారుణం జరిగింది. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిడిరెడ్డి గార్డెన్ సమీపంలో దారుణ హత్య జరిగింది. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తిమ్మరాసి పల్లికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాస్ గౌడ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు వేటకొడవళ్ళతో నరికి చంపారు. ఇండికా కార్లో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు తొలుత శ్రీనివాస్ గౌడ్‌తో వాగ్వాదానికి దిగారని, అనంతరం వేటకొడవలితో నరికి చంపారని పోలీసులు తెలిపారు.
ఘటనా స్థలానికి చేరుకున్న వనస్థలిపురం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాస్ గౌడ్ రెండు నెలల క్రితం ఓ వ్యక్తిని బ్లాక్ మెయిల్ చేసినట్లు సమాచారం. వ్యక్తి భార్య ఫొటోలు తన వద్ద ఉన్నాయంటూ బ్లాక్మెయిల్ చేసినట్లు తెలిసింది. పోలీసులు ఈ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్‌గౌడ్‌కు ఉన్న అక్రమ సంబంధమే ప్రాణాలు పోవడానికి కారణమని అనుమానిస్తున్నామని వనస్థలిపురం ఏసీపీ గాంధీ నారాయణ తెలిపారు.
మరోవైపు పట్టపగలు జరిగిన ఈ హత్యతో స్థానికంగా కలకలం రేగింది.
Be the first to comment