కమలానికి కలిసొచ్చేకాలం… దెబ్బకు దారిలోకొచ్చిన మాల్యా

లండన్: భారత బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్‌కు పారిపోయిన వ్యాపారవేత్త, కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా దెబ్బకు దారిలోకి వచ్చాడు. తాను ఎగ్గొట్టిన సొమ్మంతా తిరిగి ఇచ్చి వేస్తానంటూ ట్వీట్ చేశాడు. అగస్టా వెస్ట్‌లాండ్ కుంభకోణంలో మధ్యవర్తి అయిన క్రిష్టియన్ మైఖేల్‌ను యూఏఈ భారత్‌కు అప్పగించడంతో మాల్యాకు భయం పట్టుకుంది. మోదీ తనను కూడా నేడో, రేపో పట్టుకుపోతాడని మాల్యా పసిగట్టాడు. అందుకే తాను ఎగ్గొట్టిన సొమ్మంతా ఇచ్చేస్తానని, భారత ప్రభుత్వానికి, భారత బ్యాంకులకు విజ్ఞప్తి చేశాడు.

అటు క్రిస్టియన్ మైఖేల్ ద్వారా అగస్టా కుంభకోణం మొత్తం బట్టబయలు కానుంది. యూపిఏ హయాంలో జరిగిన ఈ కుంభకోణంతో కాంగ్రెస్ పెద్దలు అనేకమంది చిక్కుల్లో పడ్డట్లే. మరో నాలుగు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో క్రిస్టియన్ మైఖేల్‌ను యూఏఈ అప్పగించడం, ఎగ్గొట్టిన సొమ్మంతా తిరిగి ఇచ్చేస్తానని ట్వీట్ చేయడం మోదీ సర్కారుకు ప్లస్ పాయింట్లుగా మారనున్నాయి.

ఎన్నికల వేళ కమలం పార్టీకి తాజా పరిణామాలు కలిసి రానున్నాయి. అవినీతిపై ఉక్కుపాదం అంటూ ఎన్డీయే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచీ నరేంద్ర మోదీ పెద్ద పోరాటమే చేశారు. అనేక అంతర్జాతీయ వేదికలపై ఆర్ధిక నేరగాళ్లను కట్టడి చేయడం, అప్పగింత వంటి అంశాలపై గట్టిగా మాట్లాడారు. అనేక మంది దేశాధినేతలను ఒక్కతాటిపైకి తెచ్చారు. అంతేకాదు త్వరలో నీరవ్ మోదీ, లలిత్ మోదీలను కూడా భారత్‌కు తీసుకువచ్చేందుకు కేంద్రం న్యాయపరమైన పోరాటం చేస్తూనే ఉంది.

పాకిస్థాన్‌కు పారిపోయి తలదాచుకున్న మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీమ్‌ను కూడా భారత్‌కు తీసుకొచ్చేందుకు యత్నాలు తీవ్రంగా జరుగుతున్నాయి. ఇందుకోసం పాక్‌పై అంతర్జాతీయ దేశాల ఒత్తిడి తెచ్చేలా మోదీ వ్యూహం పన్నుతున్నారు. దావూద్‌ను కూడా తీసుకొస్తే మోదీ నిజాయితీ గ్రాఫ్ మరింత పెరుగుతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ అంశం బీజేపీకి మరింత మేలు చేయనుంది.

కొత్తూరు విజయ్, జర్నలిస్ట్, గుడివాడ

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*