కూకట్‌‌పల్లి ఎప్పటికైనా తనదే అంటున్న కడప కుర్రాడు!

హైదరాబాద్: కూకట్‌‌పల్లి.. ఇప్పుడీ ఈ నియోజకవర్గం పేరు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యావత్ దేశ వ్యాప్తంగా మార్మోగుతోంది. 2018 ఎన్నికల మొత్తం మీద ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే కూకట్‌‌పల్లి పేరే అటు సోషల్ మీడియాలోగానీ.. ఇటు టీవీ చానెళ్లు, వార్తాపత్రికల్లో ఎక్కువ సార్లు వినిపించింది. ఎందుకంటే.. ఈ నియోజకవర్గం నుంచి నందమూరి కుటుంబం నుంచి.. దివంగత నేత హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. దీంతో కూకట్‌పల్లిపై నందమూరి, నారా వారి కుటుంబాలు ప్రత్యేక దృష్టిని సారించాయి. మరోవైపు 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసి.. కారెక్కిన మాధవరం కృష్ణారావు ఇక్కడ్నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నారు. అటు బీజేపీ కాంతారావును బరిలోకి దించింది. దీంతో కూకట్‌పల్లి నియోజకవర్గంలో టఫ్ ఫైట్ తప్పదని తేలింది. దీనికితోడు పలు పార్టీల నుంచి కొత్త అభ్యర్థులు, బలమైన ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా బరిలోకి దిగారు.

ఈ తరుణంలో ఎన్నికల్లో తమ పార్టీ విజయదుందుబీ మోగిస్తుందని ‘సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి’ తరఫున పోటీ చేస్తున్న
పత్తికాని శంకర నారాయణ ధీమా వ్యక్తం చేస్తున్నారు. హేమాహేమీలతో తలపడుతున్న శంకర్‌‌ ఇంత ధీమాతో ఎలా ఉన్నారు..? అసలు
ఆయన జెండా, అజెండా ఏంటి..? కూకట్‌పల్లి ఓటరు దేవుళ్ల మనసులో నమ్మకం, స్థానం ఏమేరకు ఉందన్న విషయాలు
శంకర్‌‌ను అడిగి తెలుసుకుందాం.

శంకర్ నారాయణ మీ గురించి మూడు ముక్కల్లో..!!
పూర్తిపేరు: పత్తికాని శంకర నారాయణ
స్వగ్రామం: కడప జిల్లా, రాయచోటి మండలం, ఏపిలవంకపల్లి

1:- మనుషుల మధ్య చిన్న చిన్న గొడవలు ఉన్నా.. మంచి మనస్థత్వం ఉన్నవాళ్లు మంచోళ్లు

2:- మా ఊరిలో ఒక రచ్చబండ ఉంది. ప్రతిరోజూ సాయంత్రం అక్కడ కుర్రాళ్లు, ఊర్లోని కొందరు పెద్ద మనుషులు కలిసి ఊర్లో జరిగే విషయాలు రాజకీయాలు, క్రీడలు, సినిమాలు, గురించి చర్చించుకునే వాళ్లం. ఇదంతా పదేళ్ల కిందట జరిగిన వ్యవహారం.. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదు.. మార్పులు జరిగుండొచ్చు

3:- ఆ ఊర్లో పుట్టడం నా అదృష్టం. ఎందుకంటే ఇంటికొకరు నన్ను ఇష్టపడేవాళ్లు ఉండటం. అలా నేను పుట్టిన ఊరిలో అందరి ఆదరాభిమానాలు, ఆశీస్సులు నాకెప్పుడూ ఉంటాయి. నేనెప్పుడు ఊరెళ్లినా అందరితో మమేకవుతుంటాను.

ప్రశ్నోత్తరాలు..

01:- రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది.. ఎవరు స్ఫూర్తితో రాజకీయ అరగేంట్రం చేశారు?

శంకర్: రాచరిక వ్యవస్థ మళ్లీ వస్తుందేమో.. నా తర్వాతి తరం బానిసలు అవ్వాల్సి వస్తుందేమో! అనే భయంతో రాజకీయాల్లోకి వచ్చాను. రాజకీయాల్లో ఉన్నంత కాలం నా వంతుగా సమాజంలో మార్పుకోసం అహర్నిశలు కృషి చేస్తూనే ఉంటాను.
స్పూర్తి: నాకు నేనే స్పూర్తి.

02:- కూకట్‌‌పల్లి నుంచే మీరు ఎందుకు పోటీ చేయాలనుకున్నారు..
బలమైన కారణమం ఏమైనా ఉందా?

శంకర్: నేను ఇండియన్.. ఏ నియోజకవర్గం అయినా నాదే అని ఫీల్ అవుతాను. ఈ నియోజకవర్గ ప్రజలతో నాకు కొన్నేళ్లుగా పరిచయాలున్నాయి. ఎన్నికలొస్తేనే మిగతా పార్టీ నాయకులంతా నియోజకవర్గంలో గల్లీ గల్లీ తిరుగుతుంటారు. నేను మాత్రం పోటీ చేయాలనే ఆలోచన వచ్చినప్పట్నుంచి వార్డు వార్డుకు తిరిగి అందరి మనసులో చోటు సంపాదించుకున్నాను. స్థానికంగా చాలా సమస్యలున్నాయ్.. ఇప్పటి వరకూ పాలించిన నేతలెవ్వరూ వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. అందుకే ఇక్కడ్నుంచి పోటీ చేసి నా సత్తా ఏంటో చూపించి గెలిచి.. ప్రజా సమస్యల పరిష్కరానికి ప్రభుత్వంతో పోరాటం చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి నావంతుగా ప్రయత్నాలు చేస్తాను.

03:- అసలు సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి తరఫునే ఎందుకు బరిలోకి దిగారు..?
శంకర్: మా పార్టీ 2004లో రిజిస్టర్ అయ్యింది. ఆ పార్టీ ప్రెసిడెంట్ మొదలుకుని ద్వితియశ్రేణి నేతల వరకూ ప్రజా సమస్యలపై చాలా పోరాటాలు చేశారు. అందుకే ఆ పార్టీ సిద్ధాంతాలు, భావాలు నచ్చాయి. అంతేకాకుండా పార్టీ ప్రెసిడెంట్ నాకు బాగా పరిచయమున్న వ్యక్తి. కూకట్‌పల్లి నుంచి పోటీ చేస్తానని అడగటంతో మరో మారుమాట చెప్పకుండా ఓకే అన్నారు.

04:- మీ జెండా.. ఎజెండా ఏంటి?.. నియోజకవర్గంలో గెలిచేందుకు మీకంటూ వ్యూహాలున్నాయా..?

శంకర్: ఎజెండా:- అందరూ నాకు సమానమే.. వర్గాలు, మతాలు అనే తేడా లేకుండా అందరికీ సమాన అవకాశాలు రావాలి. ఒక్క మాటలో చెప్పాలంటే సమన్యాయం, సమ ధర్మమే నా ఎజెండా.
వ్యూహాలు:- వ్యూహాలు రచించడం.. ఎత్తుకు పై ఎత్తులు వేయడం లాంటివి మాటల్లో చెప్పలేము. అయినా వ్యూహాలు అనేవి ఎవరూ ముందుగా చెప్పుకోరు.. కాబట్టి నేను చెప్పను. పరిస్థితిని బట్టి వ్యూహాలు రచించడంలో నేను దిట్ట అని ప్రూవ్ చేసుకున్న సందర్భాలు కోకొల్లలు.

05:- పోటీ చేయాలనుకున్నప్పుడు.. నామినేషన్ విత్‌‌ డ్రాలకు ముందు మీకు ఇతర పార్టీలు ఆహ్వానించడం కానీ.. బెదిరింపులు, ప్రలోభాలుగానీ చేశారా..?

శంకర్: అవును.. ఇతర పార్టీల నుంచి ఆహ్వానాలు వచ్చాయి. కలిసి పనిచేద్దామన్నారు కానీ నేను రానని తేల్చిచెప్పాను. నన్నెవరూ బెదిరించలేదు. ఒక వేళ బయపెట్టాలని యత్నించినా ఐ డోంట్ కేర్. ఇద్దరు ప్రలోభపెట్టారు కానీ నేనేం పట్టించుకోలేదు. నా సత్తా ఏంటో నియోజకవర్గంలో చూపిస్తానంటూ ఖరాకండిగా చెప్పడంతో తర్వాత వారెవ్వరూ నా దరిదాపుల్లోకి రాలేదు.

06:- బలమైన, హేమాహేమీలతో ఢీ కొంటున్నారు.. కదా..? కచ్చితంగా గెలుస్తానన్న నమ్మకం, ధీమా మీకుందా..?
శంకర్: అవును.. కచ్చితంగా గెలిచి తీరుతాననే నమ్మకం, ధీమా నాకుంది. ఒకవేళ దురదృష్టవశాత్తు ఇప్పుడు కాకపోయినా రానున్న పదేళ్లలో కూకట్‌‌పల్లి ఎమ్మెల్యే నేనే అవుతాను..

07.. ఎన్నికల ప్రచారం ఎలా సాగింది.. నియోజకవర్గ ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా వస్తోంది?
శంకర్: శాసనసభ రద్దయిన మరుసటి రోజునుంచే అందరి కంటే ముందుగా నియోజకవర్గంలో ప్రచారపర్వంలోకి దిగాను. నియోజకవర్గంలో కొన్ని డివిజన్లలో నాకు ఫుల్ సపోర్టు ఉంది. అయితే ఒక పార్టీ పోతే మరొకటి.. ఇలా ఎవరొచ్చినా ప్రజలకు మాత్రం చేసిందేమీ లేదు. పోనీ ఓటేయ్యకుండా సైలెంట్‌గా ఉందామంటే రూలింగ్ ఆగదు కదా. ఏంటి రా ఖర్మ.. అసలు ఎవరికి ఓటేయాలో అనే సందిగ్ధంలో నియోజకవర్గ ప్రజలు ఉన్నారు.

08:- కూకట్‌పల్లిపై మీ జెండా ఎగరవేస్తారా..?
శంకర్: అవును.. ఇప్పుడు కాకపోయినా రానున్న పదేళ్లలో కచ్చితంగా కూకట్‌‌పల్లిలో నా జెండానే ఎగురుతుంది. ఆ తర్వాత నన్ను ఢీ కొట్టేందుకు.. ప్రత్యర్థి అందుకోలేనంత స్థాయికి ఎదుగుతాను. ఇది తథ్యం.. అవసరమైతే రాసిపెట్టుకోండి.! ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు నేను పోటీ చేస్తున్న బ్యాట్‌‌తో ఫోర్లు, సిక్సర్లు బాదుతుంటే అవతలి బౌలర్లు(ప్రత్యర్థి పార్టీలు) మైండ్ బ్లాక్ అవుద్దంతే..

09:- నియోజకవర్గ ప్రజలకు ఫైనల్‌గా ఏం చెబుతారు? సెటిలర్ల నుంచి మీకు ఎలాంటి సపోర్టు వస్తోంది..!

శంకర్: నియోజకవర్గ ప్రజలు నా నుంచి అద్భుతాలు ఆశించకండి. అద్భుతాలు, మాయ మాటలు చాలానే చెప్పొచ్చు.. అవన్నీ ఆచరణలోకి రావు. నియోజకవర్గ ప్రజలకు 24 గంటలూ అందుబాటులోనే ఉంటాను. సమస్యలు చెప్పడానికి వచ్చే ప్రజల కోసం నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఇందులో మీకు ఎటువంటి సందేహం లేదు. బ్యాట్ గుర్తుకు ఓటేయ్యండి.. అని నియోజకవర్గ ప్రజలను పేరుపేరునా అభ్యర్థిస్తున్నాను.

10:- దివంగత నేత హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసినికి మీరెందుకు మద్దతివ్వలేదో ఒక్క మాటలో చెప్పండి!

శంకర్: నేను ఎమ్మెల్యే అవ్వడానికి వచ్చాను. అంతేకానీ ఎమ్మెల్యేను చేయడానికి కాదు. అందుకే నేను సుహాసినీకే కాదు ఎవ్వరికీ మద్దతివ్వను.. ఇవ్వబోనంతే.

11:- కేసీఆర్‌‌ పరిపాలన మీకు నచ్చలేదా..? ఎందుకు నచ్చలేదు!

శంకర్: నాకు ఈ రాష్ట్రాన్ని ఇప్పటి వరకూ పాలించిన ఏ ప్రభుత్వమూ నచ్చలేదు. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు ఒరిగిందేమీ లేదు. మరీ ముఖ్యంగా కూకట్‌‌పల్లి నేతలు నియోజకవర్గానికి ఒరగబెట్టిందేమీ లేదు. అందుకే ఐ హేట్ దిస్ పార్టీస్.

12:- రేపొద్దున మీరు గెలవకపోతే ఇదే పార్టీలో ఉంటారా..? టాటా చెప్పేసి మరో పార్టీలోకి వెళ్తారా..!

శంకర్: ఇదే పార్టీలోనే ఉంటాను. రేపొద్దున నేనే ఒక కొత్త పార్టీని స్థాపించొచ్చు. ఒక వేళ నిజంగానే ప్రజాభివృద్ధిని సాధించే పార్టీ వచ్చినా.. ఉన్న పార్టీల్లో నాకు మంచిదనిపిస్తే నేనే వెళ్లి కండువా కప్పుకుంటాను.

13:- మీ పార్టీ బ్యానర్లు, పోస్టర్లలో అంబేద్కర్‌‌లాంటి మహామహులతో పవన్ ఎందుకు పెట్టుకున్నారు..? కారణమేంటి!
శంకర్: జనసేన పార్టీతో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన సిద్ధాంతం, విధానాలు నాకు నచ్చాయి. సమాజంలో మార్పుకోరుకునే వారిలో పవన్ మొదటివాడు. పైగా ఏపీలో అటు అధికార.. ఇటు ప్రతిపక్ష పార్టీలపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు. అందుకే ఆయనపై గౌరవంతో ఇలా చేస్తున్నాఅంతే.

14:- పవన్‌‌ ఫొటోతో మీకు ఓట్లు వస్తాయని అనుకుంటున్నారా..?
శంకర్: ఒకరి పేరు చెప్పుకుని ఓట్లు అడుక్కునే.. ఎవరో వచ్చి కిరీటం పెడతారని పరిస్థితిలో నేను లేను. ప్రజల మనస్సులో నాకంటూ స్థానం సంపాదించుకుంటాను. పవన్ అభిమానులు నా వెంటే ఉన్నారు. నన్ను తప్పుకుండా ఆదరిస్తారు.

15:- వచ్చే ఏడాది ఏపీలో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేస్తారా..!?
శంకర్: చేయాల్సిన టైమొస్తే కచ్చితంగా పోటీ చేసి తీరుతాను. మా నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ప్రయత్నాలు చేస్తాను.

థ్యాంక్యూ శంకర్.. ఆల్ ది బెస్ట్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*