కలకలం రేపుతోన్న లగడపాటి తాజా ఫోన్ కాల్స్

హైదరాబాద్: ప్రజాకూటమే అధికారంలోకి వస్తోందంటూ ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ కూటమి అభ్యర్ధులకు ఫోన్లు చేసి మరీ కంగ్రాట్స్ చెబుతున్నారు. తాజాగా ఆయన జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్ధి జీవన్ రెడ్డికి ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పారు. జగిత్యాల నుంచి గెలవబోయేది కాంగ్రెస్ పార్టీయేనని చెప్పారు. ప్రజా ఫ్రంట్‌ అధికారంలోకి వస్తుందని, జీవన్ రెడ్డి మరోమారు మంత్రి కావడం ఖాయమని లగడపాటి ఫోన్లో చెప్పారు. UPA చైర్ పర్సన్ సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న సమయంలో జీవన్ రెడ్డికి లగడపాటి నుంచి ఫోన్ వచ్చింది. ఈ విషయాన్ని జీవన్ రెడ్డి తనతో ఉన్న కార్యకర్తలకు చెప్పారు.

 

లగడపాటి ఇటీవలే మరికొందరు స్వతంత్ర అభ్యర్ధులకు ఫోన్లు చేసి తప్పకుండా గెలుస్తారని తన జోస్యం నిజం అవుతుందని చెప్పారు. ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేసిన మల్‌రెడ్డి రంగారెడ్డి తప్పకుండా గెలుస్తారంటూ లగడపాటి ఫోన్ చేసి మరీ ఆయన్ను అభినందించారు. అంతేకాదు 8 నుంచి 10 మంది వరకు స్వతంత్ర అభ్యర్ధులు గెలుస్తారంటూ లగడపాటి విలేకర్ల సమావేశం పెట్టిమరీ చెప్పారు. ప్రజా ఫ్రంట్ వైపే గాలి వీస్తోందని కూటమి అధికారంలోకి రావడం ఖాయమని లగడపాటి జోస్యం చెబుతున్నారు.

 

అయితే టీఆర్ఎస్ నేతలు మాత్రం లగడపాటి సర్వేను బోగస్ అని కొట్టిపారేస్తున్నారు. తాము తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, జాతీయ సర్వేలన్నీ ఇదే విషయాన్ని చెబుతున్నాయని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మరో 24 గంటల్లో ఫలితాలు స్పష్టంగా వెల్లడికానున్న తరుణంలో లగడపాటి అభ్యర్ధులకు ముందే ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పడం కలకలం రేపుతోంది.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*