లగడపాటి ఎఫెక్ట్.. ఫలితాలకు ముందే ఒవైసీతో కేసీఆర్ భేటీ

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెల్లడి కానున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. హంగ్‌కు అవకాశముందని, ప్రజా కూటమికే ఛాన్స్ ఎక్కువుందని ఆంధ్రా ఆక్టోపస్ బల్లగుద్ది చెబుతున్న తరుణంలో నేతలు ఒకరితో మరొకరు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలు ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌తోనూ, ఆయన సోదరుడు అక్బరుద్దీన్‌తోనూ మంతనాలకు యత్నిస్తున్నట్లు తెలిసింది. హంగ్ ఏర్పడితే ప్రజా కూటమికి మద్దతివ్వాలని ఎంఐఎం అధినేతను కోరినట్లు తెలిసింది.

టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎంఐఎం అధినాయకత్వంతో చర్చలు జరిపారు. అసదుద్దీన్‌తో ఏకాంతంగా చర్చలు జరిపారు. తమకు మెజార్టీ వస్తుందని టీఆర్ఎస్ భావిస్తున్నప్పటికీ లగడపాటి సర్వే ఆధారంగా కనుక మెజార్టీ తగ్గితే ఎంఐఎం మద్దతు తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఎంఐఎం మద్దతు తీసుకున్నా అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోతే ఇండిపెండెంట్ల సాయం తీసుకోవాలని కేసీఆర్ యోచిస్తున్నారు.  2014 నుంచీ ఎంఐఎంతో సత్సంబంధాలున్న నేపథ్యంలో టీఆర్ఎస్‌కు మద్దతు విషయంలో ఏకాభిప్రాయం ఉంది. అదే సమయంలో అసద్‌తో జరిపే ఏకాంత చర్చల్లో కేసీఆర్ అన్ని విషయాలపై చర్చించారు. బీజేపీతో మద్దతు అవసరం అయితే ఏం చేయాలనే విషయంపైనా కేసీఆర్ సమాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది. కేసీఆర్‌తో సమావేశానికే ముందే అసదుద్దీన్ ట్వీట్ చేస్తూ తమ వైఖరిని స్పష్టం చేశారు. టీఆర్ఎస్‌ తమ మద్దతు లేకుండానే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు.

ఎంఐఎం లేకుంటే టీఆర్ఎస్‌కు మద్దతిచ్చేందుకు అభ్యంతరం లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఇప్పటికే స్పష్టం చేయడంతో కేసీఆర్ ఆలోచనలో పడ్డారు. అన్ని కోణాల్లోనూ వ్యూహాలు రచిస్తున్నారు. బీజేపీ నేతలతోనూ కేసీఆర్ సమాలోచనలు జరపనున్నారని సమాచారం.

మంగళవారం మధ్యాహ్నానికి ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ తరుణంలో నేతలు అన్ని యత్నాలూ ముమ్మరం చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*