గెలిచినా ఓడినా అదే మాట మీద ఉంటారా? రాజకీయాల నుంచి తప్పుకుంటారా?

హైదరాబాద్: తెలంగాణలో మరో 24 గంటల్లో అసెంబ్లీ ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో ప్రచార సమయంలో అభ్యర్ధులు విసురుకున్న రాజకీయ సవాళ్లు ఆసక్తికరంగా మారాయి. టీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎన్నికలకు ముందు కేటీఆర్ చెప్పారు. తాజాగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయాలకు గుడ్‌బై చెబుతానని సంచలన ప్రకటన చేశారు. నిజానికి కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటావా అని రేవంత్‌ను కేటీఆరే ప్రశ్నించారు. ఆ సవాల్‌ను రేవంత్ స్వీకరించారు.

టీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న ప్రకటనపై కేటీఆర్ నిలబడాలని రేవంత్ కోరారు. మాటపై నిలబడకపోతే కేటీఆర్‌ది కల్వకుంట్ల వంశమే కాదని తెలంగాణ సమాజం భావించాల్సి ఉంటుందని రేవంత్ చెప్పారు.

మరోవైపు కూటమి గెలిచేంతవరకు గడ్డం తీయనన్న తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల తర్వాత మాట్లాడుతూ తాను డిసెంబర్ 12వ తేదీన గడ్డం తీయబోతున్నానని వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రజా కూటమికి 70 సీట్లు రావడం ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ నెల 12న తమ కూటమి తరపున సీఎం ప్రమాణం ఉంటుందని కూడా అన్నారు.

ఇదిలా ఉంటే టీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ తనను గెలిపిస్తే రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తానని, తాను ఓడిపోతే విశ్రాంతి తీసుకుంటానని, తనకు పోయేదే లేదని, ప్రజలే నష్టపోతారని చెప్పారు. ఇలా సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య నడుస్తోన్న తెలంగాణ రాజకీయంలో ఎవరు మాటపై నిలబడతారు? ఎవరు మాట తప్పుతారనేది  మరికొద్ది గంటల్లోనే తేలనుంది.

ఎగ్జిట్ పోల్స్‌లో జాతీయ సంస్థలు నిర్వహించిన సర్వేలన్నీ టీఆర్ఎస్‌కే మళ్లీ అధికారం దక్కుతుందని తేల్చి చెప్పాయి.  అయితే ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ మాత్రం అధికారం ప్రజా కూటమిదే అని విశ్వాసంగా చెబుతున్నారు. ఒకవేళ లగడపాటి సర్వేలు అబద్ధమని తేలితే ఆయన సర్వేలకున్న విశ్వసనీయత దారుణంగా దెబ్బతినడం ఖాయం. ఈ తరుణంలో ఫలితాలపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*