బిగ్ బ్రేకింగ్ న్యూస్: టీఆర్ఎస్‌లో పెను సంచలనం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిలో సంచలన మార్పు చోటు చేసుకుంది. కల్వకుంట్ల తారక రామారావును టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇకపై దేశ రాజకీయాలపై దృష్టి సారించనున్నారు. కేటీఆర్‌ను త్వరలో ముఖ్యమంత్రిని చేసే అవకాశాలున్నాయని కూడా ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ ఇక ఢిల్లీకే పరిమితం అవుతారని తెలుస్తోంది.

అటు కేటీఆర్‌ను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా చేస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై టీఆర్ఎస్‌లో సంశ్రమాశ్చర్యాలు వ్యక్తమౌతున్నాయి. అత్యంత నమ్మకస్తుడు, అత్యంత సమర్థుడు కాబట్టే కేటీఆర్‌కు కార్య నిర్వాహక అధ్యక్ష బాధ్యత అప్పగించినట్లు కేసీఆర్ స్వయంగా చెప్పినట్లు సమాచారం.

అటు కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కీలకంగా ఉంటారు. అయితే సీఎంగా మాత్రం కేటీఆర్ మాత్రమే ఉంటారని తెలుస్తోంది. మరోవైపు తాను మామ కేసీఆర్ ఎలా చెబితే అలా నడచుకుంటానని హరీశ్ గతంలోనే స్పష్టం చేశారు.

 

సీఎంగా ప్రమాణం చేసిన 24 గంటల్లోపే కేటీఆర్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. తనపై పనిభారం పెరుగుతున్న నేపథ్యంలోనే పార్టీని తాను కోరుకున్న రీతిలో ముందుకు తీసుకెళ్లే బాధ్యతను కేసీఆర్ కేటీఆర్‌కు అప్పగించినట్లు టీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించడం, సంస్థాగతంగా తిరుగులేని శక్తిగా టిఆర్ఎస్ పార్టీని తీర్చిదిద్దే బాధ్యతలను కేటీఆర్‌కు అప్పగించారు. ఇప్పటి వరకు అప్పగించిన బాధ్యతలన్నీ అత్యంత విజయవంతంగా నిర్వహించినందుకే కేటీఆర్‌కు పార్టీ బాధ్యతలు అప్పగించారని సమాచారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*