72ఏళ్ల వయసులో ముచ్చట తీర్చుకున్న కమల్‌నాథ్

భోపాల్: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ కమల్‌నాథ్‌‌ 72 ఏళ్ల వయసులో ముచ్చట తీర్చుకున్నారు. చింద్వారా నుంచి తొమ్మిది సార్లు ఎంపీగా ఎన్నికైన కమల్‌నాథ్‌‌ గతంలో రెండు సార్లు కేంద్ర మంత్రిగా పనిచేశారు. ప్రొటెం స్పీకర్ గానూ వ్యవహరించారు. అయితే ఎన్ని కేంద్ర మంత్రి పదవులున్నా మధ్యప్రదేశ్‌కు సీఎం కావాలన్న తన ముచ్చట తీర్చుకోలేకపోయారు. అందుకే తాజాగా జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 114 స్థానాలు రావడంలో కీలకంగా వ్యవహరించినందుకు తనకు సీఎం పదవి ఇవ్వాలని కమల్‌నాథ్ పట్టుబట్టారు.

కమల్‌నాథ్ కాకుండా పార్టీ యువనేత జ్యోతిరాదిత్య సింధియా వైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మొగ్గుచూపడం, యూపిఏ చెయిర్ పర్సన్ సోనియాగాంధీ, ప్రియాంక వాధ్రా కమల్‌నాథ్‌ను బలపచడంతో సమస్య ఏర్పడింది. సింధియాను ఒప్పించడానికి గంటల తరబడి మంతనాలు జరపాల్సి వచ్చింది. చివరకు పార్టీ శాసనసభాపక్ష నేతగా కమల్‌నాథ్‌ను ఎన్నుకున్నారు. సీఎంగా తనను ఎంపిక చేశాక గానీ కమల్‌నాథ్ తన పట్టువీడలేదు.

230 స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి 114 స్థానాలు వచ్చాయి. అయితే మ్యాజిక్ మార్క్ 116కు కాంగ్రెస్ పార్టీ చేరుకోలేకపోయింది. దీంతో ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలు, ఓ సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే మద్దతిచ్చారు. దీంతో మధ్యప్రదేశ్‌లో 15 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. శివరాజ్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ గట్టిగా పోరాడినా మ్యాజిక్ నెంబర్ దక్కించుకోలేకపోయింది. అయితే బలమైన శివరాజ్‌సింగ్ ప్రభుత్వాన్ని ఓడించడంలో కమల్‌నాథ్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించారంటూ కాంగ్రెస్ పార్టీ ఆయన్ను మధ్యప్రదేశ్ సీఎంగా ఎంపిక చేసింది. దీంతో 72 ఏళ్ల వయసులోనూ సీఎం కావాలన్న తన చిరకాల కోరికను కమల్‌నాథ్ తీర్చుకోగలిగారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*