మేనల్లుడిని కోల్పోవడంతో భావోద్వేగానికి గురైన చంద్రబాబు

కందులవారిపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కందులవారిపల్లిలో తన మేనల్లుడు కనుమూరి ఉదయ్ కుమార్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. తన సోదరిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. చిన్న వయసులోనే ఉదయ్ కుమార్ గుండెపోటుతో చనిపోవడంపై బాధపడ్డారు. చంద్రబాబు వెంట నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మిణి, మంత్రి నారాలోకేష్ కూడా ఉదయ్‌కు నివాళులర్పించారు. కనుమూరి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఉదయ్ కుమార్ పార్థివ దేహానికి నివాళులర్పించిన వారిలో చిత్తూరు పార్లమెంట్ సభ్యులు ఎన్. శివప్రసాద్, శాసన సభ్యులు సత్యప్రభ, శంకర్ యాదవ్,తలారి ఆదిత్య, ప్రజాప్రతినిధులు గాలి భానుప్రకాష్, నాని, సినీ నిర్మాత శేషగిరిరావు, సినీ హీరో నారా రోహిత్, నారా ఇందిర తదితరులు వున్నారు. ఉదయ్‌కుమార్ భౌతికకాయానికి నివాళులర్పించిన అనంతరం మంత్రి నారాలోకేశ్ ట్వీట్ చేశారు. ఉదయ్ ఆకస్మిక మరణం తనను షాక్‌కు గురిచేసిందన్నారు.

అంతకుమందు చంద్రబాబు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. రేణిగుంటకు చేరుకున్నాక అక్కడే ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న మంత్రి ఎన్. అమరనాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న, డిఐజి టి.కె.రాణా, ఎస్పీడిసిఎల్ సిఎండి ఎం.ఎం. నాయక్, తిరుపతి మునిసిపల్ కమీషనర్ విజయరామరాజు, అర్బన్ ఎస్పీ అన్బు రాజన్, సబ్ కలెక్టర్ మహేష్ కుమార్ తదితరులతో కలిసి నేరుగా నారావారి పల్లె సమీపంలో ఉన్న కందులవారి పల్లెకు చేరుకున్నారు. ఉదయకుమార్ అంత్యక్రియలలో పాల్గొన్నాక చంద్రబాబు అమరావతికి తిరిగి పయనమయ్యారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*