సూరి హత్య కేసులో తీర్పు వెల్లడి

హైదరాబాద్: మద్దెల చెరువు సూరి హత్య కేసులో న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. సూరిని హత్య చేసిన భాను కిరణ్‌కు నాంపల్లి కోర్టు యావజ్జివ శిక్ష ఖరారు చేసింది. దీంతో పాటు 25 వేల రూపాయల జరిమానా కూడా విధించింది. తీర్పుపై పైకోర్టుకు వెళ్లాలని భానుకిరణ్ యత్నిస్తున్నారు. మరోవైపు తన భర్త హంతకుడికి ఉరిశిక్ష విధించాలని సూరి భార్య గంగుల భానుమతి కోరుతున్నారు.

కేసులో మరో దోషి మన్మోహన్ సింగ్‌కు ఐదేళ్ల జైలుశిక్ష పడింది. దీంతో పాటు ఐదు వేల రూపాయల జరిమానా కూడా చెల్లించాలని న్యాయస్థానం తీర్పు వెలువరించింది. అలాగే సరైన సాక్ష్యాధారులు లేవనే కారణంగా సుబ్బయ్య, రమణ, హరి, వంశీలను నిర్ధోషులుగా ప్రకటించింది.

2011 జనవరి 4వ తేదీన తన అనుచరుడు మల్లిశెట్టి భానుకిరణ్‌ చేతిలో సూరి దారుణ హత్యకు గురయ్యాడు. సూరితోపాటు కారులో ప్రయాణిస్తున్న భానుకిరణ్‌ యూసఫ్‌గూడ ప్రాంతానికి వచ్చిన తర్వాత తనవద్ద ఉన్నతుపాకీతో కాల్చి చంపి పరారయ్యాడు.

టీడీపీ నేత పరిటాల రవి హత్య కేసులో సూరి ప్రధాన నిందితుడు. సూరి కారులో వెళ్తుండగా భానుకిరణ్‌ తుపాకీతో కాల్చి పరాడయ్యడని మరో నిందితుడు మన్మోహన్ న్యాయస్థానానికి తెలిపాడు. కేసును మొదట బంజారాహిల్స్‌ పోలీసులు దర్యాప్తు చేసి, తర్వాత సీఐడీకి అప్పగించారు.

సూరిని హత్య చేసిన తర్వాత మధ్యప్రదేశ్‌ పారిపోయిన భానుకిరణ్‌ సియోని ప్రాంతంలో తలదాచుకున్నాడు. కేసు దర్యాప్తు చేపట్టిన సీఐడీ 2012 ఏప్రిల్‌ 21వ తేదీన జహీరాబాద్‌ వద్ద ఒక దాబాలో భానుకిరణ్‌ను అరెస్టు చేసింది. అతని నుంచి తుపాకీ, సెల్‌ఫోన్లు, ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి భానుకిరణ్ జైల్లోనే ఉన్నాడు. బెయిల్‌ కోసం ప్రయత్నించినప్పటికీ ఫలించలేదు.

అటు తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని, అమ్మను చూసుకోవడానికి శిక్ష తగ్గించాలని భానుకిరణ్ న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశాడు. అయితే పైకోర్టుకు వెళ్లేందుకు న్యాయమూర్తి అనుమతించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*