టార్గెట్ 2019… ఏపీ నుంచి యూపీ దాకా అమిత్ షా వ్యూహమిదే!

న్యూఢిల్లీ: మరో ఐదారు నెలల్లో పార్లమెంట్‌కు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఏపీ నుంచి యూపీ దాకా ఎన్డీయే బలం పెంచుకునేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. బీజేపీని సొంతంగా అధికారంలోకి  తీసుకువచ్చేందుకు వ్యూహాలు రచిస్తూనే ఎన్డీయే పక్షాలు చేజారిపోకుండా వ్యవహరిస్తున్నారు.

తాజాగా బీహార్‌లో ఎన్డీయే పక్షాలైన జనతా దళ్ యునైటెడ్, లోక్ జన్ శక్తి పార్టీలతో పొత్తు కుదుర్చుకున్నారు. తాజా ఒప్పందం ప్రకారం 40 సీట్లున్న బీహార్‌లో జేడీయూ, బీజేపీ చెరి 17 స్థానాల్లో పోటీ చేస్తాయి. ఎల్‌జేపీ ఆరు స్థానాల్లో పోటీ చేస్తుంది.

ఎన్డీయే నుంచి ఆర్ఎల్ఎస్‌పీ నేత కుష్వాహ ఇటీవలే బయటకు వెళ్లిపోయారు. దీంతో ఎల్‌జేపీ అధినేత రాం విలాస్ పాశ్వాన్ తాను కోరుకున్నట్లుగా ఆరు సీట్లివ్వాల్సిందేనని పట్టుబట్టారు. ఈ తరుణంలో ఆయన్ను బుజ్జగిస్తూ చివరకు ఆరు స్థానాలిచ్చేందుకు షా అంగీకరించారు. జేడీయూ అధినేత, బీజేపీ సీఎం నితీశ్‌కుమార్, పాశ్వాన్‌లతో చర్చలు జరిపి ఒప్పందాన్ని ప్రకటించారు.

తాను కోరుకున్నట్లుగా ఆరు సీట్లు ఇవ్వకపోతే పాశ్వాన్‌… ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని మహా కూటమివైపు వెళ్లిపోయేవారు. ఇప్పటికే కుశ్వాహ లాలూ వైపు వెళ్లిపోవడంతో షా జాగ్రత్త పడ్డారు. పాశ్వాన్‌తో చర్చలు జరిపి ఒప్పందం కుదుర్చుకున్నారు.

దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమౌతున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపిఏ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలను తమవైపు తిప్పుకునేందుకు యత్నిస్తోంది. ఈ తరుణంలో పట్టువిడుపులతో వ్యవహరించకపోతే ఒక్కొక్కరు బయటకు వెళ్లిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కారణాలేవైనా ఇటీవలే టీడీపీ ఎన్డీయే నుంచి బయటకు వెళ్లిపోయింది. ఆర్ఎల్‌ఎస్పీ కూడా ఎన్డీయేకు గుడ్‌బై చెప్పింది. శివసేన కూడా తొలినుంచీ అసమ్మతి స్వరం వినిపిస్తోంది. దీంతో షా స్వయంగా రంగంలోకి దిగి శివసేన అధినాయకత్వంతో చర్చలు జరిపి మహారాష్ట్రలో పరిస్థితులు చేజారకుండా వ్యవహరించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం బీజేపీకి ఏ పార్టీతోనూ పొత్తులేదు. గతంలో పొత్తు పెట్టుకున్న టీడీపీ, జనసేన ఎన్డీయేకు దూరం జరిగాయి. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో కొత్త పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల తర్వాత కూడా బీజేపీ పొత్తులు కుదుర్చుకునే అవకాశం ఉంది. వైఎస్ఆర్‌సీపీ ఎన్డీయే, బీజేపీలకు సమదూరం పాటిస్తోంది.

2019 ఎన్నికల నేపథ్యంలో ప్రతి ప్రాంతీయ పార్టీ ముఖ్యంగా మారిపోయింది. ప్రతీ పార్టీ ఏదో ఒక కూటమిలో చేరకపోతే లాభంలేని పరిస్థితి నెలకొంది. అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు యూపిఏలో చేరిపోయారు. ప్రధానిగా రాహుల్ అభ్యర్ధిత్వాన్ని బలపరుస్తున్నారు. దక్షిణ భారత దేశంలో కీలకమైన తమిళనాడులో డీఎంకే కూడా రాహుల్ ప్రధాని అభ్యర్ధిత్వాన్ని బలపరుస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్‌తో కలిసి అధికారం పంచుకుంటున్న జేడీఎస్ యూపిఏలో భాగస్వామిగా ఉంది. మోదీ సర్కారును తీవ్రంగా వ్యతిరేకించే వామపక్షాలు కూడా యూపిఏకు మద్దతుగా ఉంటున్నాయి. కేరళలో అధికారంలో ఉన్న సీపీఎం కూటమి కూడా యూపిఏకు మద్దతుగా ఉంది.

తమిళనాట అన్నాడిఎంకేతో పాటు రజినీకాంత్‌ పార్టీతో బీజేపీ ఎన్నికల్లో లేదా ఎన్నికల అనంతరం పొత్తులు పెట్టుకోవచ్చు. కర్ణాటలో బీజేపీ సొంతంగానే బలంగా ఉంది. అయితే జేడీఎస్, కాంగ్రెస్‌ పొత్తును ఢీ కొట్టాలంటే బీజేపీ మరింత బలం పెంచుకోక తప్పదని అమిత్ షాకు తెలుసు. అందుకే పార్టీని మరింత బలోపేతం చేసేందుకు యత్నిస్తున్నారు. అటు కేరళలో బీజేపీ బలం పెరుగుతోంది. శబరిమల వివాదం నేపథ్యంలో హిందువుల్లో వచ్చిన చైతన్యం బీజేపీకి మేలు చేసే అవకాశాలున్నాయి. విజయన్ ప్రభుత్వానికి బీజేపీ చెక్ పెట్టే అవకాశాలున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ లబ్దిపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు.

ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీకి 2014లో ఎక్కువ సీట్లు వచ్చాయి. యూపీ సహా హిందీ బెల్ట్ అంతా కమలనాథులకు పట్టం కట్టింది. అయితే 2019 ఎన్నికల్లో గతంలో మాదిరిగా అత్యధిక సీట్లు వచ్చే అవకాశం తగ్గవచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది. అయితే పార్లమెంట్ ఎన్నికలకు పరిస్థితి మారుతుందని కమలనాథులు అంచనావేస్తున్నారు. అందుకు తగినట్లుగా ప్రజల్లో ఉంటూ  మోదీ సర్కారుపై నమ్మకం సన్నగిల్లకుండా 2019లో మరోసారి అధికారం ఇవ్వాలని కమలనాథులు గట్టిగా ప్రచారం చేస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధిక సీట్లు సాధించాలని బీజేపీ అధిష్టానం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. గతంలో తక్కువ స్థానాలు గెలుచుకున్న పశ్చిమబెంగాల్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు సాధించేదిశగా షా పావులు కదుపుతున్నారు. ఎన్డీయేతో పాటు యూపియేకు కూడా సమదూరం పాటిస్తూ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ఒక్కటయ్యే పార్టీల నేతలతోనూ షా జాగ్రత్తగా గమనిస్తున్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శతృవులు ఉండరన్నట్లు 2019 ఎన్నికల నాటికి నేడు శతృవులుగా కనపడే నేతలు మళ్లీ మిత్రులయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రధానిగా భారత ప్రతిష్టను ఇనుమడింప చేసిన నరేంద్ర మోదీ నాయకత్వం దేశానికి మరోసారి అవసరమని కమలనాథులు దేశ ప్రజలకు అర్ధం అయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.  భారత్ విశ్వగురు స్ధానంలో నిలబడాలంటే నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావాలని పట్టుబడుతున్న షా అందుకు తగినట్లుగానే వ్యూహాలు రచిస్తూ అమలు చేస్తున్నారు.

                                     —— కొత్తూరు విజయ్‌కుమార్, జర్నలిస్ట్, గుడివాడ 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*