బుక్‌ఫేర్‌లో రామకృష్ణా మఠం స్టాల్‌‌ ప్రత్యేకతే వేరయా!

హైదరాబాద్: భాగ్యనగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతోన్న బుక్‌ఫేర్‌కు పుస్తకప్రియులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. లక్షల సంఖ్యలో పుస్తక ప్రియులు వస్తుండటంతో కుంభమేళా వాతావరణం కనపడుతోంది. పుస్తకాలు కూడా పెద్ద సంఖ్యలో అమ్ముడుపోతున్నాయి. దీంతో ఇక్కడ స్టాళ్లు ఏర్పాటు చేసుకున్నవాళ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు నిర్వాహకులు కూడా ఆనందంగా ఉన్నారు. పుస్తకప్రియులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

బుక్‌ఫేర్‌లో వందలాది బుక్‌స్టాల్స్ ఉన్నాయి. వీటిలో 19, 20 నెంబర్లలో ఉన్న రామకృష్ణా మఠం బుక్ స్టాల్, 49, 50 నెంబర్లలో ఉన్న సాహిత్యనికేతన్, 198, 199 నెంబర్లలో ఉన్న నేషనల్ బుక్ ట్రస్ట్, యోగొదా మఠం బుక్ స్టాల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దేశభక్తి, ఆధ్యాత్మిక, వ్యక్తిత్వ వికాస, చరిత్ర పుస్తకాలు ఈ స్టాళ్లలో అందుబాటులో ఉన్నాయి. చిన్నారులకు బాగా ఉపయోగపడే పుస్తకాలు ఇక్కడ కొలువుతీరాయి. జీవితకాలం పారాయణం చేయదగిన, నిత్యం చదవ గలిగే పుస్తకాలు ఈ స్టాళ్లలో అందుబాటులో ఉన్నాయి.

రామకృష్ణ పరమహంస, శారదామాత, స్వామీ వివేకానంద జీవిత విశేషాలు, బోధనలు రామకృష్ణామఠం స్టాల్‌లో అందుబాటులో ఉన్నాయి. చిన్నారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పుస్తకాలు కోకొల్లలుగా ఉన్నాయి. స్వామీ వివేకానంద చిత్ర పటాలతో రూపొందించిన కొత్త సంవత్సరం డైరీలు, క్యాలండర్లు అందుబాటులో ఉన్నాయి.

యోగొదా మఠం స్టాల్‌లో పరమహంస యోగానంద రచించిన ఒకయోగి ఆత్మకథతో పాటు అనేక పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. క్రియాయోగ సాధకులకు ఉపయోగపడే పుస్తకాలు ఎన్నో ఈ స్టాల్‌లో ఉన్నాయి. యోగొదా మఠం న్యూ ఇయర్ క్యాలెండర్లు కూడా స్టాల్‌లో అందుబాటులో ఉంచారు.

ఈ నెల 15న ప్రారంభమైన ఈ బుక్‌ఫేర్ ఈనెల 25న ముగియనుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*