టీడీపీ పాలనపై శ్రీకాంత్ రెడ్డి విమర్శనాస్త్రాలు

రాయచోటి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్లను అమలుచేసి, వారి సంక్షేమానికి కృషి చేశారని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. రాయచోటిలో పర్యటించిన ఆయన టీడీపీ పాలనపై విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు నాయడు ఎన్నికల సమయంలో ఇస్లామిక్ బ్యాంకును ఏర్పాటు చేసి, ముస్లిం మైనారిటీలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని హామీ ఇచ్చి, ఎన్నికల తరవాత ఆ మాటే మరచిపోయారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు పూర్తి అయినప్పటికీ ముస్లింలకు తన మంత్రి వర్గంలో చోటు కల్పించలేదన్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో చివర్లో మంత్రి పదవి ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్నాడని శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు.

దివంగత ముఖ్యమంత్రి వై‌ఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన ఫీజ్ రీయంబర్స్‌మెంట్, 4 శాతం రిజర్వేషన్ల వల్ల ముస్లిం మైనారిటీలు ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థానాలను పొందుతున్నారని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. చంద్రబాబు నిన్నటి వరకు బిజెపితో కలిసి పనిచేసి, దేశ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌తో కలిసామని చెప్పుకోవడం ఆయనకే చెల్లిందని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.

రాయచోటి పట్టణంలోని కొత్తపల్లె ప్రాంతంలో శ్రీకాంత్ రెడ్డి, వైఎస్ఆర్‌సిపి మైనారిటీ నాయకులు ఇంటింటికెళ్లి ప్రజలను పలకరించారు. వైఎస్ఆర్‌సిపి అధికారంలోకి వస్తే అమలు చేసే నవరత్న పథకాల గురించి వివరించారు. చంద్రబాబు ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. స్థానికులు తమ సమస్యలను శ్రీకాంత్ రెడ్డికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*