టీడీపీతో బీజేపీ ఢీ… తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే సంచలన నిర్ణయం

తాడేపల్లిగూడెం: బీజేపీ ఎమ్మెల్యే, దేవాదాయ శాఖ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఓ పక్క చంద్రబాబు తన పాలనపై మూడు రోజులుగా శ్వేతపత్రాలు విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా చూపిస్తుండగా మాణిక్యాల రావు  చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలకు గతంలో ఇచ్చిన హామీలు 15 రోజుల్లో నెరవేర్చకపోతే 16వ రోజు తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అంతేకాదు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తానని హెచ్చరించారు. ఈమేరకు ఆయన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం సాయం చేయడం లేదంటూ సీఎం చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. దీనికి బహిరంగ చర్చకు సిద్ధమని మాణిక్యాలరావు ప్రకటించారు.

అటు బీజేపీ కూడా చంద్రబాబుపై విరుచుకుపడుతోంది. ప్రజావ్యతిరేకతనుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు బీజేపీని దోషిగా చూపిస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఆరోపించారు.

ధరలపై చంద్రబాబు చేస్తున్న ప్రకటనలను కూడా బీజేపీ తమ అధికారిక ట్విటర్ అకౌంట్‌లో తూర్పారబట్టింది.

చంద్రబాబు అబద్ధాల కొండ అని ఏపీ  బీజేపీ  అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఆరోపించారు.

పేదల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం సాయం చేస్తుంటే చంద్రబాబు సర్కారు కమీషన్ల కోసం జన్మభూమి కమిటీలను జొప్పించి పేద ప్రజల ధనాన్ని పీక్కుతింటోందని బీజేపీ ఆరోపించింది.

వాస్తవానికి 2014లో బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడిగా పోటీ చేశాయి. అప్పటికి జనసేన రాజకీయ పార్టీగా పూర్తి స్థాయిలో సిద్ధం కాకపోయినా పవన్ కళ్యాణ్ మద్దతిచ్చారు. కేంద్ర, రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఏపీలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా బీజేపీకి టీడీపీ, జనసేన దూరమయ్యాయి. ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు యూపిఏకు దగ్గరయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా లభించవచ్చంటూ ఆయన రాహుల్ ప్రధాని అభ్యర్ధిత్వానికి మద్దతు తెలిపారు. యూపీఏతర పక్షాలను ఒకతాటిపైకి తెచ్చి కాంగ్రెస్‌కు మద్దతిచ్చేలా చేయాలని చంద్రబాబు యత్నిస్తున్నారు. ఈ మేరకు ఆయన అనేకమంది ప్రాంతీయ పార్టీల అధినేతలను కలుసుకున్నారు. చర్చలు జరిపారు. ఇప్పటికే వామపక్షాల మద్దతు సంపాదించారు. అదే సమయంలో ప్రధాని మోదీపై విమర్శల తీవ్రతను పెంచారు.

మరోవైపు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఎన్డీయే పక్షాలను కాపాడుకుంటూనే ఎన్డీయేతర పార్టీల నేతలతో సత్సంబంధాలు నెరుపుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో బలం పెంచుకోవాలని బీజేపీ యత్నిస్తోంది. సొంతంగా అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ చేసే అంశాన్ని ఆ పార్టీ నేతలు యోచిస్తున్నారు. కొత్త పార్టీలతో బీజేపీ పొత్తులు పెట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ సునీల్ దేవ్‌ధర్ రాష్ట్రంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. సభలు, సమావేశాలు పెడుతూ పార్టీని బలోపేతం చేస్తున్నారు. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

2019 ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీ, టీడీపీ మధ్య యుద్ధం తీవ్రమైంది. రాబోయే కొద్దిరోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేగంగా మారే అవకాశాలున్నాయి.

——కొత్తూరు విజయ్, జర్నలిస్ట్, గుడివాడ

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*