కేసీఆర్-మోదీ భేటీపై చంద్రబాబు సెటైర్లు..

అమరావతి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఫెడరల్ ఫ్రంట్ యత్నాల పేరుతో చేస్తున్న టూర్‌పై అలాగే ఆయన ప్రధాని మోదీతో సమావేశం కానుండటంపై సీఎం చంద్రబాబు నాయుడు సెటైర్లు వేశారు. ఎన్డీయే, యూపీయేతర పార్టీలను ఒకేతాటిపైకి తెచ్చేందుకు యత్నిస్తున్నానంటూ పర్యటన జరిపి మళ్లీ ప్రధానితో సమావేశం ఎందుకు కావాలని చంద్రబాబు ప్రశ్నించారు. టూర్ వివరాలు ప్రధానికి వెళ్లడించడానికా అని చంద్రబాబు వ్యంగ్యోక్తులు విసిరారు. కేసీఆర్ తెలంగాణ సమస్యలు చెప్పుకోవడానికి ప్రధానిని కలుస్తున్నారా లేక ఫెడరల్ ఫ్రంట్ టూర్ డీటైల్స్ బ్రీఫింగ్ చేయడానికా అని చంద్రబాబు ప్రశ్నించారు.

ఫెడరల్ ఫ్రంట్ టూర్‌లో భాగంగా ఇప్పటికే కేసీఆర్ బిజూ జనతాదళ్ అధినేత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో, తృణమూల్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీతో మంతనాలు జరిపారు. లోతుగా, సుదీర్ఘంగా చర్చలు జరిపారు.

ఆ తర్వాత హస్తినకు చేరుకున్నారు. నేడు బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో చర్చలు జరుపుతారు. సాయంత్రం 4 గంటలకు కేసీఆర్‌ ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. సరిగ్గా ఈ విషయంపైనే చంద్రబాబు సెటైర్లు వేశారు. అందర్నీ కలిశాక చివర్లో మోదీని కలవడంపై చంద్రబాబు అనుమానాలు వ్యక్తం చేశారు.

 

బీజేపీకి లబ్ది చేకూర్చేందుకే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ యత్నాలని చంద్రబాబు చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్, యూపిఏ పక్షాల నేతలు కూడా ఇదే ఆరోపిస్తున్నారు. అయితే కేసీఆర్ మాత్రం తన మిషన్‌పై ముందుకే వెళ్తున్నారు. తాను యూపిఏ, ఎన్డీయేలకు ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేస్తానని, అందులో బీజేపీ, కాంగ్రెస్‌లకు తావుండదని కేసీఆర్ స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు తాము సమదూరం పాటిస్తామని చెప్పారు.

అటు చంద్రబాబు మాత్రం కాంగ్రెస్ సారధ్యంలోని యూపిఏ గూటికి చేరారు. ఏపీలో కాంగ్రెస్ పొత్తు ఉంటుందో లేదో స్పష్టం చేయకపోయినా ఆయన రాహుల్ ప్రధాని అభ్యర్ధిత్వానికి మద్దతు పలికారు. రాహుల్ ప్రధాని అయితే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారని చంద్రబాబు నమ్ముతున్నారు. మోదీ సర్కారు ఏపీకి సాయం చేయడం లేదని చంద్రబాబు ఆరోపిస్తున్నారు.

అయితే బీజేపీ మాత్రం రాష్ట్రాన్ని నిలువునా చీల్చిన కాంగ్రెస్‌తో చంద్రబాబు జతకట్టడంపై సెటైర్లు వేస్తోంది. ఎన్టీఆర్ సిద్ధాంతాలను చంద్రబాబు తుంగలో తొక్కారని కమలనాథులు ఆరోపిస్తున్నారు.

చంద్రబాబు తనపై తాజాగా చేసిన ఆరోపణలపై కేసీఆర్ స్పందించాల్సి ఉంది. బహుశా ప్రధానితో సమావేశం తర్వాత కేసీఆర్ చంద్రబాబు సెటైర్లపై స్పందించే అవకాశం ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*