ప్రేమిస్తే చావాల్సిందేనా?… మళ్లీ షురూ అయిన పరువు హత్యలు..

హైదరాబాద్, గుంటూరు: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ తిరుమల్‌గిరిలో కులాంతర పెళ్లి చేసుకున్నాడనే నెపంతో వివాహమై నాలుగేళ్ల తర్వాత నంద కిశోర్ అనే యువకుడిని భార్య బంధువులు కొట్టి చంపారు. నందకిషోర్‌కు మద్యం తాగించిన భార్య బంధువులు ఆ తర్వాత బండరాళ్లతో తలపై మోది, కర్రలతో కొట్టి చంపారు. ఈ హత్య కేసులో నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అల్వాల్ వెంకటాపురానికి చెందిన నందకిషోర్ కారు డ్రైవర్‌. పెద్దకమేళా ప్రాంతానికి చెందిన అశ్వినితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఎస్సీ మాల కులానికి చెందిన నందకిషోర్ బీసీ వడ్డెర కులానికి చెందిన అశ్విని పెద్దల్ని ఎదిరించి మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు కూడా పుట్టాడు. ఈ కులాంతర వివాహాన్ని ఇష్టపడని అశ్విని తల్లి, ఆమె బంధువులు భర్తని వదిలేయాలని, మరో పెళ్లి చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇటీవలే వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. అలిగిన అశ్విని తన రెండేళ్ల కుమారుడిని తీసుకుని పుట్టింటికెళ్లింది. కులాంతర వివాహం చేసుకోవడమే కాకుండా తమ కుమార్తెను అల్లుడు వేధింపులకు గురిచేస్తున్నాడని భావించి మట్టుపెట్టేందుకు పథకం వేశారు. ఇందులో భాగంగా నందకిషోర్‌ను పెద్దకమ్ముల దగ్గరున్ననిర్మానుష్య ఆర్మీ స్థలాల్లోకి రమ్మని అశ్విని బంధువులు పిలిచారు. నందకిషోర్‌తో కలిసి మద్యం తాగాక కులాంతర వివాహంతో తమ పరువు తీశావంటూ గొడవకు దిగారు. ఆ తర్వాత నందకిశోర్ తలపై బండరాళ్లతో మోది, కర్రలతో కొట్టి చంపారు. తన కుమారుడిని బావమరిది మహేశ్వర్, అతడి బంధువులే హత్య చేశారని నందకిశోర్ తల్లి ఆరోపించారు. నమ్మి అత్తింటికి వెళ్తే ప్రాణాలు తీశారని ఆమె వాపోతున్నారు. హత్య జరిగిన ప్రదేశంలో పోలీసులు ఆధారాలను సేకరించారు. నందకిషోర్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీమార్చురీకి తరలించారు. ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ హత్యలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందో తెలుసుకుంటున్నారు.

అటు గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం హుస్సేన్ నగరంలో దారుణం జరిగింది. తన కుమార్తెను ప్రేమించాడన్న కోపంతో సుధాకర్ అనే యువకుడిని యువతి తండ్రి సాంబశివరావు హతమార్చాడు. రెండేళ్లుగా తన కుమార్తెను ప్రేమిస్తున్నాడనే విషయం తెలిసి గతంలో సుధాకర్‌ని సాంబశివరావు హెచ్చరించాడు. అయినా మార్పురాలేదని సుధాకర్‌ని చంపేందుకు ప్లాన్ వేసి అమలు చేశాడు. పెదకూరపాడులో కాపు కాసి సుధాకర్‌ని కర్రలతో కొట్టించాడు. తీవ్ర గాయాల పాలైన సుధాకర్ చనిపోయాడు. సుధాకర్ చనిపోయాడని తెలుసుకున్న సాంబశివరావు కుటుంబ సభ్యులు పరారయ్యారు.

కులాంతర వివాహం చేసుకున్నారని గతంలో నల్గొండ జిల్లాలో ప్రణయ్ హత్య జరిగింది. వైశ్య కులానికి చెందిన అమృత.. ఎస్సీ వర్గానికి చెందిన ప్రణయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుందని ఆమె తండ్రి హత్య చేయించాడు. మరో ఘటన హైదరాబాద్‌లో జరిగింది.  ప్రేమించి పెళ్లి చేసుకుందని ఎర్రగడ్డలో ఓ తండ్రి కుమార్తెను దారుణంగా నరికేశాడు. మంచిర్యాల జిల్లాలో ప్రేమ వివాహం చేసుకుందని నాలుగు రోజుల క్రితం కుమార్తెను కాల్చి చంపారు ఆమె తల్లిదండ్రులు. మంచిర్యాల జిల్లా, కాలమడుగు గ్రామంలో వైశ్య కులానికి చెందిన అనూరాధ యాదవ కులానికి చెందిన లక్ష్మణ్‌ను ప్రేమ పెళ్లి చేసుకుందని ఆమె తల్లిదండ్రులు, బంధువులు దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని బూడిద చేసి నీటిలో కలిపేశారు.

పరువు పేరుతో ప్రేమికులను బలిగొంటోన్న సంస్కృతిపై  ఆందోళన వ్యక్తమౌతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*