కేసీఆర్ దూషణలపై స్పందించిన చంద్రబాబు 

అమరావతి: డర్టియెస్ట్ పొలిటీషియన్ అంటూ తనను తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దూషించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. కేసీఆర్ వాడిన భాష అభ్యంతరకరంగా, అసభ్యంగా ఉందన్నారు. నోరు పారేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేసీఆర్ పూర్తిగా పద్ధతి లేకుండా మాట్లాడాలని చంద్రబాబు విమర్శించారు. పద్ధతి లేని రాజకీయాలు తానెప్పుడూ చేయలేదని, తానెప్పుడూ హుందాతనం కోల్పోలేదని చెప్పారు. కేసీఆర్ గతంలో నరేంద్ర మోదీని, కాంగ్రెస్ పార్టీ నేతలను కూడా దూషించారని, తాను మాత్రం దూషించబోనని చంద్రబాబు చెప్పారు. అవసరమైతే వైసీపీతో, మోదీతో పొత్తు పెట్టుకుని ఏపీలో పోటీ చేయవచ్చని చంద్రబాబు కేసీఆర్‌కు సూచించారు. 300 కోట్ల రూపాయలతో ప్రగతి భవన్‌ కట్టుకున్న కేసీఆర్‌కు రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన 1500 కోట్ల రూపాయలు సరిపోవా అని కేసీఆర్ అనడం విడ్డూరమన్నారు.

కేసీఆర్‌కు మంత్రిపదవులిచ్చింది తామేనని, టీడీపీతో పొత్తు కోసం టీఆర్ఎస్‌ ప్రాధేయపడిందని చంద్రబాబు చెప్పారు. నందమూరి హరికృష్ణ మరణంపై తాను రాజకీయాలు చేశాననడంపై చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్ర స్థాయిలోనూ, జాతీయ స్థాయిలోనూ కలిసి పనిచేద్దామని కేసీఆర్‌కు సూచించానని చంద్రబాబు స్పష్టం చేశారు. ఢిల్లీలో అసలైన మోదీ ఉంటే మిడిల్ మోదీ కేసీఆర్ అని, జూనియర్ మోదీ జగన్ అని చంద్రబాబు చెప్పారు.

తాను నిప్పులాంటి మనిషినని, నిప్పులా బతికానని, కేసీఆర్ బ్లాక్‌మెయిలింగ్‌కు తాను భయపడబోనని చంద్రబాబు చెప్పారు. తనను మానసికంగా ఎవ్వరూ దెబ్బతీయలేరని, మోదీనే ఏకపక్షంగా ఎదుర్కొంటున్నానని చంద్రబాబు చెప్పారు.

 

ఏపీ, ఒడిశా, పశ్చిమబెంగాల్,  ఢిల్లీ పర్యటన విశేషాలు చెప్పేందుకు కేసీఆర్ హైదరాబాద్‌లో నిన్న విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు డర్టియెస్ట్ పొలిటీషియన్ అన్నారు. రాహుల్ పంచన చేరిన చంద్రబాబుకు స్థిరత్వం, విధానం లేవన్నారు. చంద్రబాబు లీడర్ కాదని మేనేజర్ అని కేసీఆర్ ఎద్దేవా చేశారు.

హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయడంలో కూడా రాజకీయాలు చేస్తున్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలను కూడా చంద్రబాబు తప్పుబట్టారు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*