సంచలన నిర్ణయం తీసుకున్న ప్రకాశ్ రాజ్

హైదరాబాద్: ఆంగ్ల సంవత్సరాది ఆరంభ దినాన నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఏ పార్టీ తరపున కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్ధిగా బరిలోకి దిగుతానంటూ ట్వీట్ చేశారు. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే విషయంపై త్వరలోనే వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. ప్రజల మద్దతుతో మరింత బాధ్యతను తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని ట్వీట్‌లో తెలిపారు.

వామపక్ష భావజాలం ఉన్న ప్రకాశ్ రాజ్ కొంత కాలంగా కేంద్రంలోని మోదీ సర్కారుకు ప్రశ్నలు సంధిస్తున్నారు. జస్ట్ ఆస్కింగ్ అని హ్యాష్ ట్యాగ్ పెట్టి ప్రశ్నలడుగుతున్నారు. కొంతకాలంగా ఆయన సోషల్ మీడియాలో పెట్టే పోస్టులపై మిశ్రమ స్పందన వ్యక్తమౌతోంది. కొన్ని వివాదాస్పదమౌతున్నాయి.

ప్రకాశ్ రాజ్ టీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఎం, సీపీఐ నాయకత్వాలతో కూడా సత్సంబంధాలు కలిగి ఉన్నారు. దీంతో బీజేపీ వ్యతిరేక పార్టీల మద్దతుతో ఆయన బరిలోకి దిగుతారని తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో గెలిచి ప్రజల తరపున పార్లమెంట్ వేదికగా ప్రశ్నలు సంధిస్తానని ప్రకాశ్ రాజ్ చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*