స్లెడ్జింగ్‌ను పక్కనపెట్టి పైన్ పిల్లల్ని ఆడించిన పంత్

ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ భార్య బోనీ ఇన్‌స్టాగ్రామ్‌‌లో చేసిన ఓ పోస్టు వైరల్ అవుతోంది. పైన్ పిల్లల్ని ఎత్తుకుని ఆడిస్తున్న ఆ ఫొటోపై కామెంట్ల వర్షం కురుస్తోంది. భారత్-ఆస్ట్రేలియా జట్టు సభ్యులు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మొర్రిసన్‌ అధికారిక నివాసంలో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పైన్ పిల్లల్ని ఎత్తుకున్న రిషభ్ పంత్ వారిని కాసేపు ఆడించాడు. ఈ ఫొటోను టిమ్ భార్య బోనీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది.

మూడో టెస్టులో రిషభ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో టిమ్ టీజ్ చేశాడు. వన్డే జట్టులో చోటు కోల్పోయినందుకు ఎద్దేవా చేస్తూ ఎలాగూ బోల్డంత ఖాళీ సమయం ఉంటుంది కాబట్టి తమ పిల్లల్ని ఆడించాలని కోరాడు. తన భార్యను తీసుకుని సినిమాకు వెళ్తానని, తిరిగి వచ్చే వరకు పిల్లల్ని ఆడించాలని కోరిన పైన్.. ‘‘ఇంతకీ నువ్వు పిల్లల్ని బాగా చూసుకోగలవా?’’ అంటూ టీజ్ చేశాడు. ఆ తర్వాత టిమ్ బ్యాటింగ్ సమయంలో పంత్ అతడిని ‘తాత్కాలిక కెప్టెన్’ అంటూ ఆటపట్టించాడు. అయితే స్లెడ్జింగ్ అంతా మైదానంలో మాత్రమేనని, బయటకొస్తే దానిని అక్కడే వదిలేస్తామని పంత్ నిరూపించాడు. టిమ్ పిల్లల్ని ఎత్తుకుని ముద్దు చేశాడు.

అదంతా మైదానం వరకే పరిమితమని, బయట తామంతా మంచి స్నేహితులమని రిషభ్ నిరూపించాడు. టిమ్ పిల్లల్ని ఆడించి మంచి ‘బేబీ సిట్టర్’ అనిపించుకున్నాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*